తెల్లచొక్కాను పసుపులో ముంచి వేసుకున్నాం: అదే గుర్తింపని బాబు
తెల్లచొక్కాను పసుపులో ముంచి వేసుకున్నాం: అదే గుర్తింపని బాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి నష్టం కలగదని.. పసుపు చొక్కానే తనకీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు. గతంలో ఓసారి తెల్లచొక్కాను పసుపులో ముంచి వేసుకున్నామని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడంటే ఏసీ రూములున్నాయి కానీ, గతంలో గండిపేటలో రేకుల షెడ్డే ఉండేదని చెప్పారు. ఉదయం పోతే రాత్రి వరకు అక్కడే ఉండేవాడ్ని అని గుర్తు చేసుకున్నారు. తనతోపాటు చాలా మంది పని చేశారని అన్నారు. ఆ ఫలితాలే ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలిపారు.
విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు, సంస్థాగత ఎన్నికలు, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిన పార్టీ అని.. పార్టీయే లేకపోతే ప్రభుత్వమే లేదని చంద్రబాబు అన్నారు.

సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లడమే తప్ప ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నామని.. ఎక్కడా విసుగు, విరామం లేకుండా పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఏపీ అగ్రరాష్ట్రంలో నిలవాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.
పార్టీ, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. స్ఫూర్తిదాయక నాయకత్వం ఉంటేనే వ్యవస్థల పనితీరు సక్రమంగా ఉంటుందన్నారు. పార్టీలో గతంలో కంటే క్రమశిక్షణ కాస్త తగ్గిందని.. నేతలు తమ వ్యవహారశైలిని సమీక్షించుకోవాలని సూచించారు.
తనకు తాను 3నెలలకోసారి పరీక్షలు రాస్తున్నానని, తాను ఎంత మేర పని చేస్తున్నానో విశ్లేషించుకుంటున్నానని తెలిపారు. జవాబుదారితనం తీసుకురావడానికి ప్రయత్నించాలని అన్నారు. ఎన్నికష్టాలు ఎదురైనా తాను 208రోజులు పాదయాత్ర చేశానని చెప్పారు. టిడిపి విలువలు, విశ్వసనీయత ఉన్న పార్టీ అని తెలిపారు.
టీడీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని, నేతల తప్పిదాలే పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. కొన్ని నియోజకవర్గాలు మినహా రాష్ట్రంలో జనచైతన్య యాత్రలు అద్భుతంగా జరిగాయని తెలిపారు. ఎన్నో సవాళ్లను టిడిపి అధిగమించిందని, లక్ష్యాలతో ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. మనం చేస్తున్న పని మనమే బేరీజు వేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications