సీఎం జగన్ ఫైనల్ నిర్ణయాన్ని సవాల్ చేసిందెవరు??
వ్యక్తులుకానీ, వ్యవస్థలుకానీ తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి జగనే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఆయన తీసుకునేదే ఎప్పుడూ తుది నిర్ణయం కాదని, న్యాయవ్యవస్థ అనేది ఒకటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ హితవు పలికారు. కొవ్వూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు స్వాగతించారు.
Recommended Video

బ్యాంకు పాలకవర్గానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రభుత్వం ఆ పాలకవర్గాన్ని రద్దుచేసి త్రిసభ్య కమిటీని నియమించింది. గెలుపొందిన పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించగా త్రిసభ్య కమిటీ చట్టవిరుద్ధమంటూ కోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికలను రద్దుచేసి వ్యవస్థనే అపహాస్యం పాల్జేసిన జగన్‌కు కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని చంద్రబాబు అభివర్ణించారు. న్యాయబద్ధంగా జరిగే ఏ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరనే విషయం కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికతో స్పష్టమైందన్నారు. ఇప్పటినుంచైనా చట్టాలకు, అవి రూపొందించిన నిబంధనలకు లోబడి పనిచేయడం నేర్చుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications