చంద్రబాబును చూసి భావోద్వేగం: అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ రూ. 10 లక్షల సాయం
గుంటూరు: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో దారుణ హత్యకు గురైన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. అంతేగాక, బాధిత కుటుంబానికి టీడీపీ తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించారు.
అమర్నాథ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తొలుత చంద్రబాబును చూసి అమర్నాథ్ కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమర్నాథ్ హత్య ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వస్తున్నారని తెలిసి అమర్నాథ్ నివాసం వద్దకు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమర్నాథ్ హత్య బాధాకరమైన సంఘటన అని అన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థిని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు చంపేశారని ధ్వజమెత్తారు. అమర్నాథ్ బంధువులు అంబులెన్స్ కోరినా పోలీసులు సమకూర్చలేదని ఆరోపించారు. బాలుడు మరణించిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదన్నారు.
హత్య చేసిన నేరస్తులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలుడిపై ఎదురు కేసు పెట్టడానికి ప్రయత్నించారన్నారు చంద్రబాబు. ఇంతటి ఘటన జరిగితే ముఖ్యమంత్రి కనీసం ఇక్కడకు రాలేదన్నారు. హత్య జరిగిన తర్వాత ఎంపీ వచ్చి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మౌనంగా ఉండాలని చెబుతారని మండిపడ్డారు.
ఇవాల మచిలీపట్నంలో హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడితే రాజకీయాలు అంటారా? ఆడబిడ్డకు అండగా నిలవడం శవ రాజకీయం అవుతుందా? అని ప్రశ్నించారు. అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోకపోతే బాధితులపైనే ఎందుకు కేసు పెట్టేవారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అరాచక పాలనపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలోనే యువతిని సామూహిక అత్యాచారం చేశారని.. ఇప్పటి వరకూ నిందితులకు శిక్షపడలదేన్నారు చంద్రబాబు.
అమర్నాథ్ సోదరిని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఆడబిడ్ల్ని కాపాడే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. కాగా, ఇటీవల అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి నిందితులు సజీవ దహనం చేసిన విషయం విధితమే. బాధితుడు చనిపోయే ముందు నిందితుల పేర్లు చెప్పడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications