మండే ఎండలో మోడీ స్పీచ్ విన్న చంద్రబాబు..! అన్నదాత సుఖీభవ వేళ..!
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం ఏటా ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల్ని ఇవాళ తన నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోడీ విడుదల చేశారు. మూడు విడతల్లో రెండేసి వేలు చొప్పున ఇస్తున్న ఈ పథకంలో మొదటి విడతగా రెండు వేల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీని తర్వాత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పీఎం కిసాన్ కు అనుబంధంగా అమలు చేస్తున్న తమ పథకాల్ని ప్రారంభించాల్సి ఉంది. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
అయితే వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ పథకం నిధులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించాల్సి ఉండటంతో ఇవాళ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శికి వెళ్లారు. అక్కడ ముందుగా వారణాసిలో ప్రధాని మోడీ ప్రసంగం పూర్తయిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించాల్సి ఉండటంతో అది పూర్తయ్యే వరకూ లైవ్ లో చంద్రబాబు దాన్ని చూస్తూ కూర్చొన్నారు.

ఓవైపు ఎర్రటి ఎండలో రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన మంచంపై కూర్చుని ప్రధాని మోడీ ప్రసంగం వినడం ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి స్టేజీ మీద నుంచి మోడీ ప్రసంగం వినే వీలున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఎందుకనో స్టేజీ కిందే ఉన్న మంచంపై కూర్చుని ఈ ప్రసంగం విన్నారు. సీఎం చంద్రబాబే ఎర్రటి ఎండలో కూర్చుని మోడీ ప్రసంగం వింటుంటే తమదేముందని ఇతర ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం ఆయన పక్కనే కూర్చుని విన్నారు.

మోడీ ప్రసంగం ముగిశాక సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని దర్శిలో ప్రారంభిస్తారు. అనంతరం అన్నదాత సుఖీభవ పథకం లబ్దిదారులకు కేంద్రం ఇచ్చే రెండు వేలకు తోడు, రాష్ట్రం తరఫున మరో ఐదు వేలు కలిపి మొత్తం 7 వేలు జమ చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం లబ్దిదారుల్ని గుర్తించడంతో పాటు అర్హులెవరూ నష్టపోకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. రైతుల పథకం కావడంతో ఇందులో ఎక్కడ ఏ తేడా వచ్చినా ఇబ్బందులు ఉంటాయన్న భావనతో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ప్రశంసలు అందుకున్నాయి.












Click it and Unblock the Notifications