రెచ్చగొట్టొద్దు, చూపిస్తా: కేసీఆర్‌పై బాబు, కసి తగ్గొద్దు
విశాఖ: అభివృద్ధిలో తనతో పోటీ పడమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనతో సవాల్ చేశారని, తప్పకుండా పోటీ పడతానని, అయితే, అనవసరంగా రెచ్చగొట్టవద్దని, నా శక్తి ఏమిటో నిరూపిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. విశాఖ చోడవలంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు వారిని ఐక్యంగా ఉంచే సత్తా టీడీపీకే ఉందన్నారు.
వదిలి పెట్టను
రుణమాఫీ విషయమై ఆర్బీఐకి ఎన్నిసార్లు చెప్పినా ఏపీ, తెలంగాణల్లో నష్టం జరగలేదని చెబుతున్నారని, అయినా తాను వదిలి పెట్టేది లేదన్నారు. తాను ఒకసారి పట్టుబడితే సాధించే వరకు జీవితంలో వదిలి పెట్టనన్నారు. డ్వాక్రా సంఘాలకు లక్ష రుణమాఫీ, రైతులకు లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తామన్నారు.
వ్యవసాయం లాభసాటిగా అయ్యే వరకు రైతులకు అండగా ఉంటామని, అందుకోసం నిర్దిష్ట కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. రుణమాఫీ అందరికీ అందేలా చూస్తామన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులను తయారు చేస్తామన్నారు.

సత్య నాదేళ్ల.. దటీస్ తెలుగువాడు, సింగపూర్‌లా చేస్తా
ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ కంపెనీకి తెలుగు వాడు అయిన సత్య నాదేళ్ల ఎండీగా ఉన్నారని, తెలుగు వాడు ఏదైనా సాధించగలడనేందుకు ఇదే నిదర్శనమన్నారు. తన మదిలో చాలా ఆలోచనలు ఉన్నాయని చెప్పారు.
ఏపీలో తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, భారత్‌లో ఆదర్శ రాష్ట్రంగా చేస్తామన్నారు. అప్పటి వరకు తాను నిద్రపోయే ప్రసక్తి లేదన్నారు. ఏపీని ఒక సింగపూర్‌లా చేస్తామన్నారు. అప్పటి వరకు నిద్రపోకుండా పని చేస్తానన్నారు. భగవంతుడు ఏపీకి తీరప్రాంతం ఇచ్చాడన్నారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెప్పారు.
కేసీఆర్ నాతో పోటీ పడతానంటున్నారు
కేసీఆర్ తన కంటే బాగా అభివృద్ధి చేస్తానని, పోటీ పడమని చెబుతున్నాడని, తప్పకుండా పోటీ పడతానన్నారు. అయితే, అనవసరంగా రెచ్చగొట్టవద్దన్నారు. తన శక్తి ఏమిటో చూపిస్తానన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తనకు తెలుసునని, వారికేం తెలుసన్నారు. తెలుగు జాతిని రెచ్చగొట్టడం, విడగొట్టడం కాదన్నారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారని, ఎవరి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకుంటారన్నారు.
మేమే చదివిస్తాం
తెలంగాణలోని ఆంధ్రా వాళ్లను మేమే చదివిస్తామని చంద్రబాబు అన్నారు. ఏపీ సీఎంగా వారిని నేనే చదివిస్తానని చెప్పారు. అయితే, ఎవరు ఏపీ వారో నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణలో హైదరాబాదును అభివృద్ధి చేశామని, రేపు రాబోయే రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత తెలంగాణే తీసుకుంటుందన్నారు. ఈ విషయాన్ని నేను గట్టిగా చెబుతున్నానన్నారు.
కసి తగ్గొద్దు
ఎన్నికలకు ముందు కాంగ్రెసు పార్టీ పైన ఏపీ ప్రజలకు కోపం, కసి ఉందని, అవమానం భరించారని చంద్రబాబు అన్నారు. ఆ కసి ఇప్పుడే తగ్గొద్దన్నారు. బాబు గెలిచారు.. అన్నీ ఆయనే చూసుకుంటాడని అనుకోవద్నద్నారు. తాను కష్టపడి పని చేస్తానని, అధికారులు, మంత్రులతో పని చేయిస్తానని, అలాగే మీరు కృషి చేయాలన్నారు. కాంగ్రెసు పార్టీ పైన ఉన్న కోపం, కసి.. ఏపీని అభివృద్ధి చేశాకనే తగ్గాలన్నారు. పేదరికం పూర్తిగా నిర్మూలిస్తామన్నారు.












Click it and Unblock the Notifications