చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు!!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ.. తెలుగు తమ్ముళ్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దీక్షలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతూ,అభినందించారు.
ఈ సందర్భంగా యువ ఎంపీ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి ఏమయినా అక్రమాలు జరిగాయా లేదా అన్నది ఆధారాలతో సహా చూపించాలని, అంతేకానీ తప్పుడు ఆరోపణలతో తమ అధినేతను అరెస్టు చేయడం తగదని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలూ పాటుపడే ఏకైక నేత చంద్రబాబు అని,ఆయన కృషి కారణంగా ఇవాళ రెండు తెలుగు ప్రాంతాలు ఎన్నో ప్రగతి ఫలాలు అందుకున్నాయన్నారు.

జగన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని, ఏ పాటి అభివృద్ధి కూడా చేయని ప్రభుత్వం అని విమర్శించారు. 3 రాజధానుల పేరిట ప్రకటనలే తప్ప పనులు లేవని పెదవి విరిచారు. అలానే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్పునకు సంబంధించి కానీ,ఫైబర్ నెట్ కు సంబంధించి కానీ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు, బనాయిస్తున్న తప్పుడు కేసులు అన్నవి నిలబడవని అన్నారు.
చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఆయనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని చెప్పారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ నడుస్తోందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ప్రవర్తిస్తుందే తప్ప ఇందులో మరో ఉద్దేశం ఏమీ కనబడడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
గతంలో అక్రమాస్తుల కేసులు ఎదుర్కొన్న జగన్, ఆ రోజు జరిగిన ఘటనలను మరిచిపోకూడదని అన్నారు. పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ ఇవాళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పదేళ్ల పాటు బెయిల్ లో ఉంటూ అధికారం అందుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications