చంద్రబాబు 'విదేశీ' వ్యాఖ్యలు: అలా అనలేదని వివరణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తుంటే విదేశాల నుంచి పాలిస్తున్నట్లుందని చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపై బుధవారం వివరణ ఇచ్చింది.
ఆ మాటలను చంద్రబాబు అనలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎపి ఎన్జీవోలు కలిసినప్పుడు చంద్రబాబు ఆ మాటలు అన్నట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఆ మాటలను అనలేదని, వసతులు లేకుండా కొత్త రాజధానికి ఉద్యోగులు వెళ్లడం ఇబ్బందికరమని ఉద్యోగులు అన్నప్పుడు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని ఆ ప్రకటనలో ప్రభుత్వం వివరించింది.

హైదరాబాదులోనే ఉంటే పాలనపై అదుపు రాదని, అక్కడ ఉండి పనిచేస్తే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయో తెలియడంతో పాటు పాలనలో సౌకర్యం పెరుగుతుందని చంద్రబాబు అన్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇబ్బందులుంటాయని, దాన్ని తాను కూడా కాదనడం లేదని, కానీ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం సరి కాదని చంద్రబాబు వివరించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
వీలైనంత వరకు ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తామని, కొంత సర్దుబాటు ధోరణితో వారు కూడా సహకరించి దశలవారీగా తరలి వెళ్లడానికి సిద్ధం కావాలని చంద్రబాబు వారితో చెప్పినట్లు వివరించారు. ఏ సందర్భంలోనూ వేరే దేశం నుంచి పాలన సాగిస్తున్నట్లుందని చంద్రబాబు అనలేదని ప్రకటన స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications