ఉచిత బస్సు, పెన్షన్లు, కల్తీ పాలు-మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీ సీఎం చంద్రబాబు (chandrababu) ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రులకు పలు అంశాలపై కీలక సూచనలు చేశారు. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పలు అంశాలతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. వీటిపై ఎలా స్పందించాలన్న దానిపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే ఎప్పటిలాగే తమ శాఖలపై మంత్రులు పట్టు సంపాదించాలని చంద్రబాబు వారిని మరోసారి కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధాన అజెండా ఆమోదం తర్వాత మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు...ప్రభుత్వ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరేలా చూడాలని సూచించారు. అలాగే తమ శాఖల్లో జరిగే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వానికి రోజూ ఒక పరీక్షలాంటిదని చంద్రబాబు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అలాగే అసెంబ్లీలోనూ తమ శాఖలపై పూర్తి అవగాహనతో సమాధానాలు ఇవ్వాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో దివ్యాంగులను ధ్రువపత్రాలతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. దీంతో పాటు వచ్చే నెల ఇవ్వాల్సిన పెన్షన్లను ఈ నెల 28నే పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే అదే రోజు అసెంబ్లీకి సెలవు ఇవ్వబోతున్నారు. వైఎస్సార్సీపీ వ్యవహారశైలిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రుల్ని బాబు కోరారు. దీంతో పాటు రాజమండ్రిలో కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా కేసుల బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ నెయ్యి సహా పలు అంశాలపై విపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టిన ప్రభుత్వం ఈ విషయంలో విజయవంతం అయినట్లు భావిస్తోంది.












Click it and Unblock the Notifications