మదమెక్కి.. కొవ్వు కరిగిస్తా-పవన్ విమర్శలపై చంద్రబాబు పబ్లిక్ వార్నింగ్..?
ఏపీలో మహిళలపై, ప్రభుత్వ పెద్దలపై వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై నిన్న కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై అక్కడికక్కడే స్పందించి నెల రోజుల్లో చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఇవాళ బహిరంగంగా వాటిపై స్పందించారు. ఇవాళ అమరావతిలోని తాళ్లాయపాలెంలో జరిగిన విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియా పోస్టులపై తీవ్రంగా స్పందించారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని, వీటిపై తన బిడ్డలు సైతం బాధపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. అలాగే వాటిపై చర్యలు తీసుకోని పోలీసులపైనా ఫైర్ అయ్యారు. దీనిపై ఇవాళ తాళ్లాయపాలెంలో స్పందించిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో వాడే భాష చూస్తున్నామని, ఆడబిడ్డలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తనపై, హోంమంత్రి అనితపై, డిప్యూటీ సీఎం పవన్‌పై కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు తెలిపారు. పవన్‌పైనే కాదు, ఆయన పిల్లలపైనా వ్యాఖ్యలు చేశారన్నారు.. ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా.. చర్యలు తీసుకోవాల్సిందే. అని చంద్రబాబు స్పష్టం చేశారు. తానెప్పుడూ రాజకీయం చేయనని, తనను మోసం చేయాలనుకుంటే వదిలిపెట్టనని చంద్రబాబు తెలిపారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, ఇక ఖబడ్దార్ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కొవ్వు ఎక్కువై నేరస్తులుగా తయారవుతున్నాయని, వారి కొవ్వు కరిగిస్తానని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఇబ్బంది కలిగించేలా పోస్టులు పెడితే సహించేది లేదని, తమది చేతగానితనం అనుకోవద్దని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. భావ వ్యక్తీకరణ అంటే వ్యక్తిత్వ హననం చేయడమా అని ప్రశ్నించారు. మీకు ఏ చట్టం ఏ హక్కు ఉందన్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications