దళిత కార్డు: ప్రొఫెసర్ చక్రపాణికి కెసిఆర్ గాలం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దళిత మేధావికి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు ప్రత్యామ్నాయంగా ఓపెన్ యూనివర్శిటీ సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చక్రపాణిని బుజ్జగించే పనిలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. దళిత నేతను ముఖ్యమంత్రిగా చేస్తాననే హామీ నుంచి వెనక్కి తగ్గిన కెసిఆర్ ఇప్పుడు మరో రూపంలో దళిత వర్ణాన్ని జత చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కెసిఆర్ ఘంటా చక్రపాణిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. అయితే, ఈలోగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ తిరిగి కాంగ్రెసు గూటికి చేరారు. దీంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీకి దిగాల్సిందిగా ఘంటా చక్రపాణిని కెసిఆర్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఘంటా చక్రపాణి పెద్దపల్లి నియోజకవర్గానికి చెందినవారు.

గత వారంలో రెండు సార్లు ఆయన ఘంటా చక్రపాణి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. మొదట ఆయనకు సికింద్రాబాద్ లోకసభ స్థానం ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. అయితే, ఘంటా చక్రపాణి మాత్రం పోటీకి విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఘంటా చక్రపాణి రాజకీయ విశ్లేషకుడిగా ఇటీవలి కాలంలో టీవి చానెళ్లలో విస్తృతంగా కనిపిస్తున్నారు. అదే సమయంలో విద్యార్థి దశ నుంచి హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. వామపక్ష భావజాలం ఉన్నవారు. తొలినాళ్లలో జర్నలిస్టుగా కూడా పనిచేశారు.












Click it and Unblock the Notifications