కాన్వెంట్లకు ధీటుగా: స్కూలు పిల్లల యూనిఫాంపైనా నీలం రంగు: జూన్ 1 నాటికి కిట్స్ రెడీ.. !
అమరావతి: ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోన్న జగనన్న విద్యా కానుక పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న కిట్స్ గురించి ఆరా తీశారు. విద్యాసంవత్సరం ఆరంభానికి 10 రోజుల ముందే ఆయా కిట్స్‌ను స్కూల్ పిల్లలకు చేరవేయాలని, తరగతులు ఆరంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికీ కిట్ అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ఆరు రకాల వస్తువులను అందజేయబోతోన్న విషయం తెలిసిందే. ఇందులో- మూడుజతల యూనిఫారమ్స్, బూట్లు, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్ ఉంటాయి. వాటి డిజైన్లు ఎలా ఉండాలనే విషయంపై వైఎస్ జగన్.. ఈ సమీక్ష సందర్భంగా ఆరా తీశారు. విద్యా మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, స్పెషలాఫీసర్ కే వెట్రిసెల్వి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్.. యూనిఫారమ్స్ డిజైన్లను పరిశీలించారు. వాటిల్లో మార్పులు చేర్పులను సూచించారు. స్కూల్ కిట్స్‌ను సకాలంలో విద్యార్థులకు చేరవేయాలని అన్నారు. జాప్యం చేయకూడదని, తరగతులు ఆరంభమైన తరువాత కిట్స్‌ను సరఫరా చేయడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించడంతో పాటు.. అందులో చదివే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లీషులో బోధన కొనసాగించాల్సి ఉన్నందున.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు అవకాశం ఇవ్వొద్దని అన్నారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల గురించి స్పెషలాఫీసర్ వెట్రిసెల్వి ముఖ్యమంత్రికి వివరించారు. విద్యార్థులకు ఇంగ్లీషులో బోధన కొనసాగించడానికి వీలుగా బ్రిడ్జికోర్సు కింద ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని అన్నారు. వేసవి సెలవులు ముగిసే నాటికి పూర్తిగా తాము సమాయాత్తమౌతామని వివరించారు.












Click it and Unblock the Notifications