ఇది ఇక్కడితో ఆగదు, తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. స్వయంగా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ కూటమి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్‌లో జాతికి విద్రోహం చేశారని.. మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రోజు దేశ చరిత్రలో 'బ్లాక్ డే' అంటూ వ్యాఖ్యానించారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని ఆశించామని.. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిడదవోలులో కూటమి నేతలుగా నిరసన తెలుపుతున్నామని.. ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కుంటిసాకులు చెప్పారని.. ఏ మొహం పెట్టుకుని ఆడబిడ్డలను ఓట్లు అడుగుతారని సీఎం ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై జనసేన, బీజేపీ నేతలతో మాట్లాడినట్లు చెప్పారు. మహిళల సాధికారత కోసం రిజర్వేషన్లను అడ్డుకోకుండా ఉండాల్సిందని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ బిల్లును తీసుకువచ్చారని వివరించారు. బిల్లును అడ్డుకోవడానికి వక్రభాష్యం చెప్పారని మండిపడ్డారు. నిన్న(శుక్రవారం) ప్రతిపక్ష పార్టీలు విర్రవీగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మహిళలు చట్టసభలకు వస్తే వారికి న్యాయం జరుగుతుందని ఆశించామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. 'ఈ విషయాన్ని ఖండిస్తున్నా.. గర్హిస్తున్నా. రేపటి నుంచి దేశంలోని ప్రతి ఇంటికి తీసుకువెళతాం. రాబోయే ఎన్నికలలో వారికి డిపాజిట్లు రాకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహంతో సమానమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం సంస్కృతి అని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని ఎద్దేవా చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మహిళా లోకమంతా ఏకమైందని వివరించారు. పోరాడి సాధించుకునే సమయంలో అడ్డుకోవడం క్షమించరాని నేరమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications