అడ్డరోడ్డులో మాటేసిన మృత్యువు.. ఏడుగురి ప్రాణాలు బలి
నిన్నటి వరకు ఆ ఇళ్లలో పుట్టినరోజు వేడుకల సందడి.. నవ్వులు.. బంధువుల కలయిక. వేడుక ముగిసింది.. అందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ తెల్లవారుజామున వచ్చిన ఒక ఫోన్‌కాల్ ఆ కుటుంబాల జీవితాలను ఒక్కసారిగా చీకట్లోకి నెట్టింది. ఇంటికి చేరాల్సిన వారు రక్తపు మడుగులో విగతజీవులుగా మారారు. చిన్నారులతో కలిసి సాగిన ఆ ప్రయాణం.. ఓ గ్రామాన్ని తీరని విషాదాన్ని మిగిల్చింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.

వేడుక ముగించుకుని వస్తుండగా..
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వీరంతా బాపట్ల జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లారు. వేడుకను ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అడ్డరోడ్డు వద్ద వారి ప్రయాణం విషాదాంతమైంది. ఆటో చీరాల రోడ్డులోకి వెళ్లేందుకు కుడి వైపు టర్నింగ్ తీసుకోగా.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటో తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రితో పాటు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్‌లో ఇద్దరు, చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మరొకరు మృతి చెందారు. మృతులను వేలూరు గ్రామానికి చెందిన బొంతా బాబు (62), బొంతా మణెమ్మ (55), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువార్త (45), మరియమ్మ (45)గా గుర్తించారు. మిగిలిన క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అడ్డరోడ్డు.. ప్రమాదాలకు అడ్డాగా మారిందా?
చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ మరోసారి ప్రమాదాలపై చర్చకు కేంద్రంగా మారింది. పట్టణంలోని ప్రధాన బ్లాక్‌స్పాట్‌లలో ఇది కీలకమైన ప్రాంతంగా స్థానికులు చెబుతున్నారు. ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు చిలకలూరిపేట పట్టణంతో పాటు కోటప్పకొండ, చీరాల, గుంటూరు వైపు వెళ్లేందుకు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
బైపాస్ రహదారి అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రయాణికుల కోసం ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు, ఆటోలు పట్టణం వైపు మళ్లుతుంటాయి. దీంతో అడ్డరోడ్డు వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనికి తోడు వేగంగా దూసుకెళ్లే భారీ వాహనాలు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం వంటి అంశాలు ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయాయి.
సీఎం దిగ్భ్రాంతి..
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
ప్రమాదంపై హోంమంత్రి ఆరా
ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పల్నాడు అదనపు ఎస్పీకి ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల పరిస్థితి, చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదానికి అసలు కారణాలేమిటన్న దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, రోడ్డు పరిస్థితులు, ఇతర కారణాలను అన్ని కోణాల్లో పరిశీలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి
ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని వైయస్ జగన్ కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు














Click it and Unblock the Notifications