ఈ అమ్మానాన్నలు వద్దు: పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు
విజయవాడ: తమ తల్లిదండ్రులు తమకు వద్దంటూ ఇద్దరు చిన్నారులు పోలీసులను ఆశ్రయించిన విచిత్ర సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. బడికి వెళ్తామంటే వద్దు, పనికి వెళ్లమంటున్నారని, తమకేమో చదువుకోవాలని ఉందని వారు పోలీసులకు చెప్పారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కొట్టకోవడాలేనని, తమకు ఏం చేయాలో తోచడం లేదని, తమకు ఈ అమ్మానాన్నలు వద్దని వారు కృష్ణా జిల్లా వీరపల్లి పోలీసులతో చెప్పారు.
వివరాలు ఇలా ఉన్నాయి - కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషనలో షన్నీ (12), సిద్దు (10) అనే అక్కాతమ్ముళ్లు తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. ఏలూరు పట్టణంలోని చౌడతిప్ప ప్రాంతానికి చెందిన అహ్మద్ అక్రమ్, శిరీషల పిల్లలు షన్నీ, సిద్దు. వీరు చిన్నప్పటి నుంచి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఎ.సీతారాంపురంలోని తాతయ్య వింజరపు రంగారావు ఇంట్లో పెరిగారు.

నిరుడు శుభకార్యం ఉందంటూ అక్రమ్ వీరిని ఏలూరు తీసుకెళ్లాడు. అక్రమ్ ఆటో అమ్మేసి పేకాట ఆడాడని షన్నీ తెలిపింది. ఆ డబ్బులు పోవడంతో తల్లి చెవి దిద్దులు కూడా అమ్మేసి పేకాటలో పెట్టాడని, దీంతో వారిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ కలిసి తమను చిత్రహింసలు పెడుతున్నారని పిల్లలు చెప్పారు.
దీంతో తిరిగి తాతయ్య ఇంటికి చేరామని, వారిపై అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అయితే, రెండు వారాల క్రితం రేషన కార్డుకు ఫొటోలు దిగాలంటూ తల్లిదండ్రులు తమను బలవంతంగా ఏలూరుకు తీసుకెళ్లారని, అక్కడ ఒక గదిలో నిర్బంధించి తమను చిత్రహింసలకు గురిచేశారని పిల్లలు ఆవేదన వెలిబుచ్చారు.
బుధవారం ఉదయం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బయటపడి పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు బాలిక షన్నీ తెలిపింది. తమ తండ్రి అక్రమ్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌ల్లో ఉన్నదంతా ఊడ్చేశాడని వారు చెప్పారు. అక్కను పనికి పంపిస్తూ తనను మెకానిక్ షెడ్డులో చేరాల్సిందిగా తండ్రి ఒత్తిడి చేస్తున్నట్లు బాలుడు చెప్పాడు. తల్లిదండ్రులు తమను బలవంతంగా తీసుకెళ్లినా, వారి వద్దకు పంపినా ఆత్మహత్య చేసుకుంటామని పిల్లలు చెప్పారు.
పిల్లలు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, ప్రస్తుతం కూడా వారిని పిలిపించామని, అయితే వారితో పంపడం లేదని, పిల్లలు ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వీరవల్లి ఎస్సై మురళీకృష్ణ తెలిపారు. మరోసారి ఆ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications