చికెన్ పకోడి వివాదం.. హోటల్ యజమాని దారుణ హత్య
AP Crime: చికెన్ పకోడీ కోసం ఏకంగా ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో చికెన్ పకోడీ వివాదం నిండు ప్రాణాన్ని బలి చేసింది. చికెన్ పకోడీ లేదన్నందుకు హోటల్ యజమాని దారుణంగా హత్యకు గురయ్యాడూ.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనపలో మిన్నారావు అనే యువకుడు శనివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత మద్యం మత్తులో సమీపంలోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్లి చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే హోటల్ యజమాని శంకర్ చికెన్ పకోడీ లేదని మిన్నారావుకు చెప్పాడు.

అయితే మిన్నారావు మాత్రం శంకర్ మాట వినకుండా.. తనకు చికెన్ పకోడీ కచ్చితంగా కావాలని పట్టుబట్టాడు. శంకర్ లేదని చెప్పినా మిన్నారావు వినకుండా షాపు తలుపులను గట్టిగా తన్నుతూ శంకర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వారి మధ్య వాదన పెరిగి ఇద్దరు కొట్టుకునే వరకు దారితీసింది. అప్పటికే మద్యం తాగి మత్తులో ఉన్న మిన్నారావు.. కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న సుత్తిని తీసి శంకర్ తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కత్తిని తీసుకుని శంకర్ పీక కోశాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుకు అవతల వైపు ఉన్న కాలువలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.
దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. హత్యకు పాల్పడిన నిందితుడు మిన్నారావు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications