చిరంజీవి కాంగ్రెస్‌వాదే: సినిమా, సేవా కార్యక్రమాల్లో బీజీ, త్వరలోనే క్రియాశీలకంగా అంటూ ఏపీసీసీ
అమరావతి: టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చిరంజీవి పేరు వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మారిన నేపథ్యంలో ఏపీలో పార్టీ పరిస్థితిపై చర్చ జరుగుతోంది.

చిరంజీవి కాంగ్రెస్ లేరంటూ ఊమెన్ చాందీ ప్రకటనతో..
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేరంటూ ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జీ ఊమెన్ చాందీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏఐసీసీ, ఏపీసీసీ స్పందించింది. చిరంజీవి కాంగ్రెస్ వాదేనంటూ ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదనడంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

చిరంజీవి కాంగ్రెస్ వాదే.. సినిమా, సేవా కార్యక్రమాల్లో బిజీ..
చిరంజీవి కాంగ్రెస్ వాదేనని, తనకిష్టమైన సినీరంగంలో బిజీగా ఉండటం వల్ల పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొనడం లేదని వెల్లడించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలతో చిరంజీవి మమేకమవుతున్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి క్రియాశీలకంగా..
చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులని, చిరంజీవి కాంగ్రెస్ వాది కాదంటూ వస్తున్న వార్తలు సరికాదని శైలజనాథ్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందిస్తారని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందన్నారు. కాగా, ఉమ్మడి ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత నుంచి చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరయ్యారు. రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా?
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు సన్నిహిత సంబంధాలనే కలిగివున్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలినం చేసిన విషయం తెలిసిందే. యూపీఏ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చిరంజీవి స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, ప్రస్తుతం చిరంజీవి సోదరుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో చిరంజీవి కూడా మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో జనసేన పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications