మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో వైసీపీ మాజీ మంత్రి- కేక్ కట్, బెస్ట్ విషెస్
నేడు.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మదిన వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు అభిమానులు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ కాకా టైటిల్ పోస్టర్ కూడా విడుదల కావడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. 2027 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. బాబీ కొల్లి దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద వెంకట్ కే నారాయణ దీన్ని నిర్మిస్తోన్నారు. పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. మెగాస్టార్‌కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. టాలీవుడ్ కు చిరంజీవి ఓ దిక్సూచి లాంటివారని కొనియాడారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తన ప్రతిభ, అంకితభావం, అకుంఠిత దీక్షతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారని ప్రశంసించారు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న ఎంతో మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందారని, ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. మెగాస్టార్ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరానికి చిరంజీవి సినీ ప్రయాణం ఓ పాఠ్యపుస్తకం లాంటిదని కొడాలి నాని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమని, వెండితెరపైనే కాకుండా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. కాకా చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
గుడివాడలోని స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ జన్మదిన వేడుకల్లో మెగా అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మెగాస్టార్ పేరుతో ఉన్న భారీ బ్యానర్లు, రంగురంగుల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొడాలి నాని సమక్షంలో అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కటింగ్ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాలను అభిమాన సంఘాలు ఘనంగా నిర్వహించాయి.














Click it and Unblock the Notifications