పవన్‌తో చిరుకు తలనొప్పి: నాగబాబు అన్నయ్యతోనే
హైదరాబాద్: తమ్ముడు పవన్ కళ్యాన్ రాజకీయ ప్రవేశం అన్నయ్య చిరంజీవికి తలనొప్పి తెచ్చి పెట్టేట్లుగానే ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చిరంజీవిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. తమ్ముడికి కూడా సర్దిచెప్పలేని స్థితిలో ఉన్నారనే నిందను చిరంజీవి మోయాల్సి వస్తుంది. పైగా, కాంగ్రెసుకు పవన్ కళ్యాణ్ పూర్తి వ్యతిరేకతతో పనిచేసే అవకాశాలున్నాయి.
ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు మొదటి నుంచీ ఇష్టం లేనది అంటారు. దాంతో ఆయన చిరంజీవికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఏ పార్టీని దెబ్బ తీస్తుందనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి.

గతంలో చిరంజీవి మాదిరిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ తీస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే, సీమాంధ్రలో కాంగ్రెసు భరోసా పెట్టుకున్న సామాజిక వర్గం ఓట్లను పవన్ కళ్యాణ్ కొల్లగొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే జరిగితే కాంగ్రెసు పూర్తిగా నష్టపోతుంది. అదే జరిగితే చిరంజీవి కాంగ్రెసు అధిష్టానం నుంచి తీవ్ర సమస్యను ఎదుర్కోక తప్పదు.
కాగా, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి ప్రచార పర్వంలోకి దిగిన తర్వాత కూడా చిరంజీవిని పల్లెత్తు మాట అనకపోవచ్చు. కానీ, అది చిరంజీవికి ఇబ్బందులు కలుగజేసేదే. చిరంజీవి మరో సోదరుడు నాగబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉంటాడని తొలుత ఊహించారు. కానీ ఆయన చిరంజీవి వైపే ఉండే అవకాశాలున్నాయి.
ప్రజారాజ్యం స్థాపనకు రంగం సిద్ధం చేసింది నాగబాబే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీకి కొంత మంది పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ఖాయంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications