జనసేన చిరంజీవి అభిమానులది... నా మాట విని టిడిపిని అధికారంలోకి!: పవన్ కళ్యాణ్
Recommended Video

హైదరాబాద్:నన్ను నేను ఎప్పుడూ హీరోగా భావించుకోలేదు...నాకు ఒక్కరే హీరో...ఆయనే చిరంజీవి...ఆయనకు ఎప్పుడూ అభిమానిగా ఉండిపోతానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఆలిఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడితో పాటు పలువురు చిరంజీవి అభిమాన సంఘాల ముఖ్యనేతలు సోమవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జనసేన పార్టీలో చేరారు. "జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది...ఇది నా ఒక్కడిది కాదు...ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని... తనను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదని, చిరంజీవి గురించి మాట్లాడితే మాత్రం వెళ్లి కొట్టేంత కోపం వస్తుందన్నారు"...అన్నారు పవన్ కళ్యాణ్.

చిరంజీవి...రాజకీయాలకు దూరం
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వెళ్లారని తెలిపారు. అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం నేతలు జనసేనలో చేరిక సందర్భంగా పవన్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన అన్న గొప్ప స్థాయికి ఎదిగారని...ఎన్‌సీసీలో కాలేజీ కెప్టెన్ హోదాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెల్యూట్ చేస్తూ రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొన్నారని తెలిపారు.

జనసేన...పుట్టింది అందుకే!
సామాజిక, రాజకీయ మార్పు కోసం పుట్టిందే జనసేన...ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ల మధ్య భిన్నమైన భావనలు, వ్యక్తిత్వాలు, ఆలోచనలు ఉండడంలో తప్పు లేదు. కొందరు వాటిని అర్థం చేసుకోకుండా స్పర్థలని ప్రచారం చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడితే వాళ్లే అధికారాన్ని ఇస్తారు' అని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే పనిచేసేందుకు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించాలని తాను భావిస్తానని పవన్ తెలిపారు. తన ఇజం గురించి పవన్ మాట్లాడుతూ..."నేను ప్రజల పక్షం...దాన్ని అంబేడ్కరిజం అంటారో... లోహియా మార్గం అంటారో...కమ్యూనిస్టు, సోషలిస్టు అంటారో.. మీ ఇష్టం. దానికే ఏ పేరైనా పెట్టుకోండి"...అన్నారు.

నామాటవిని...టిడిపిని...అధికారంలోకి
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడపాల్సిందిగా అప్పట్లో తనను కొందరు కోరారని పవన్ చెప్పారు. అయితే తెలంగాణలో కూడా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకునే అభిమానులున్నారని, కలపడం తప్ప విడదీయడం తన అభిమతం కాదంటూ...అందుకు నిరాకరించానని వపన్ గుర్తుచేసుకున్నారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తాను 2007లో ఏర్పాటు చేశానన్నారు. తన మాట విని 2014లో ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపించారని పవన్ వెల్లడించారు.

అభిమానులపై...ఆగ్రహం
అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఆయన అభిమానులు ‘సీఎం... సీఎం' అంటూ నినాదాలు చేశారు. అరుపులు, కేకలు వేస్తున్నవారిని ఆయన తీవ్ర స్వరంతో వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో పాటు పలుమార్లు నినాదాలతో ప్రసంగానికి అడ్డుతగలడంతో.. ‘ఏయ్.. ఎక్కువ చేయకు. అతి చేయకు... ఆపేయ్.. ఆపేయ్' అని పవన్ తీవ్రస్వరంతో ఫ్యాన్స్ ను వారించారు. త్వరలోనే చిరంజీవి అభిమానులతో మరోసారి భేటీ అవుతానని పవన్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications