రూ. కోటి చెక్కును కేరళ సీఎం విజయన్‌కు అందించిన చిరంజీవి
ప్రముఖ సినీనటుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను గురువారం కలిశారు. వయనాడ్ విపత్తుపై స్పందిస్తూ తన వంతు బాధ్యతగా రూ. కోటి చెక్కును సీఎం విజయన్‌కు అందించారు. కాసేపు ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. సీఎంకు చిరంజీవి చెక్కు అందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేగాక, ఈ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వయనాడ్ విపత్తుకు సంబంధించిన దృశ్యాలు చూసి తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు తెలిపారు. రామ్ చరణ్ కూడా ఆ దృశ్యాలు చూసి చలించిపోయాడని చెప్పారు.

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు.. తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి రూ. కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం నేరుగా కేరళ సీఎం విజయన్‌ను కలిసిన చిరంజీవి చెక్కు అందించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలు వయనాడ్‌లో పెను విషాదాన్ని నింపాయి.
కొండచరియలు విరిగిపడటంతో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకొచ్చారు. సినీ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, సూర్య, కార్తీ, నయనతార దంపతులు, కమల్ హాసన్, విక్రమ్, ఫహాద్ ఫాజిల్, రష్మిక తదితరులు కూడా తమవంతుగా ఆర్థిక సాయం అందించారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్ భారీ మొత్తంలో రూ. 2 కోట్లను వయనాడ్ బాధితులకు అందించారు. మోహన్ లాల్ రూ. 3 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఆర్మీ అధికారి హోదాలో మోహన్ లాల్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications