కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్యం విషమం - ఆర్డిక సాయం కోసం వేడుకోలు : కొడుకుతో సహా..!!
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం.

చికిత్సకు దాతల సాయం కోరుతూ
ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటించారు.
కుటుంబం మొత్తం కరోనా బారిన
అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావటంతో ఆయన కుటుంబానికి భారంగా మారాయి.
Recommended Video

ప్రముఖ హీరోల చిత్రాలకు కొరియగ్రాఫర్ గా
ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్ కోరుతున్నారు. శివ శంకర్ మాస్టర్ డాన్స్‌కి తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. 'మగధీర', 'బాహుబలి', 'అత్తారింటికి దారేది' ఇలా వందలాది చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక డాన్స్ మాస్టర్ గా కాకుండా నటుడుగా కూడా పలు సినిమాలలో కనిపించారు. శివశంకర్ మాస్టర్ కుమారుడు చేసిన ట్విట్ తో వారి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. దీంతో ఎవరైనా ముందుకొచ్చి సాయం అందిస్తారనే ఆశతో శివశంకర్ చిన్న కుమారుడు నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications