స్థానికం లో సీట్ల షేరింగ్ పై కొత్త ఫార్ములా - పవన్ జాబితా.. ఏ పార్టీకి ఏ సీటు..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల పై తీర్పు వచ్చిన వెంటనే షెడ్యూల్ ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇదే సమయంలో కూటమిలో మూడు పార్టీ ల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వస్తోంది. పవన్ తొలి నుంచి చెబుతున్నట్లుగా 2024 ఫార్ములా వద్దని.. ప్రస్తుత బలం ఆధారంగా సీట్లు ఉండాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశం పైన అవగాహనకు వచ్చారు. షెడ్యూల్ రాగానే సీట్ల పైన అధికారిక నిర్ణయం తీసుకునేలా కార్యాచరణ ఖరారైంది.
స్థానిక ఎన్నికల పైన కూటమి పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరింది. స్థానిక ఎన్నికల్లో 2024 తరహా సీట్ల షేరింగ్ కు అంగీకరించేది లేదని జనసేన తొలి నుంచి చెబుతోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు కొత్త ఫార్ములా ఖరారైంది. 2024 సీట్లతో సంబంధం లేకుండా ప్రస్తుత పార్టీల బలం ఆధారంగా సీట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా 100 శాతం గెలుపు లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు, నాయకుల మనోభావాలను గౌరవిస్తూనే.. కూటమి ఐక్యతకు భంగం కలగకుండా సీట్ల సర్దుబాటుపై ముందుకెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీ వేళ జనసేన ఆశిస్తున్న స్థానాల జాబితాను పవన్ ఆయనకు అందజేశారు. వీటిపై ఎన్‌డీఏ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. జనసేన కోరుతున్న మేయర్, మున్సిపాల్టీల స్థానాల పైన చర్చ జరుగుతోంది.

సుప్రీం తీర్పు తరువాత ఎన్నికల షెడ్యూల్
జనసేన తమకు విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, విజయ నగరం కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో విజయవాడ, తిరుపతి పైన చర్చ జరగాల్సి ఉందని చెబుతున్నారు. బీజేపీ తిరుపతి, రాజమండ్రి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక.. పవన్ తో భేటీ తరువాత పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట చైర్మన్ పదవితో పాటు 50 శాతం కార్పొరేటర్లు/కౌన్సిలర్ల స్థానాలను ఆ పార్టీ ఆశిస్తోంది. దీనివల్ల ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ సమన్వయంతో పనిచేసే వెసులుబాటు ఉంటుందని భావిస్తోంది. అయితే బీజేపీ ఆలోచన వేరుగా ఉంది. తమ ఎమ్మెల్యే ఉన్న చోట నాయకత్వం ఎలాగూ ఉంది కాబట్టి వేరే చోట చైర్మన్, కార్పొరేటర్ల స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదన తెచ్చింది. కాగా, రిజర్వేషన్లు లు ఇంకా ఖరారు కానందున.. అవి తేలాకే అభ్యర్థుల పోటీపై తుది నిర్ణయం తీసుకోగలమని టీడీపీ నేతలు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తనకు అందజేసిన జనసేన స్థానిక అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.













Click it and Unblock the Notifications
