ఆ రైతులకు రూ. 1.50 లక్షల రుణ మాఫీ - చంద్రబాబు ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకు న్నారు. రాజధానికి పార్లమెంట్ చట్టబద్దత కల్పిస్తూ రాజముద్ర వేయటంతో.. ఇక భవిష్యత్ లోనూ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అమరావతి పరిధి లో భూ సమీకరణ వేగవంతం చేయాలని భావిస్తున్నారు. తాజాగా రాజధాని పరిధిలోని పది గ్రామాల రైతులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. భూ సమీకరణకు సహకరించాలని కోరారు. వారికి కీలక హామీలు ఇచ్చారు.
అమరావతి కి ప్రభుత్వం చేస్తున్న లాండ్ పూలింగ్ కు సహకరించాలని సీఎం చంద్రబాబు ఆ ప్రాంత రైతులను కోరారు. భూ సమీకరణకు ముందుకు వచ్చి.. సహకరిస్తే వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగా భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి రూ.40 వేల చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామన్నారు. అదే విధంగా వారికి ఏడాదికి రూ.3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. భూ సమీకరణ కు సహకరించిన వారి కుటుంబానికి రూ.1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతి పరిధిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని పది గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. భూ సమీకరణ విషయంలో వారి అభిప్రాయాలను.. వినతులను స్వీకరించారు. భూ సమీకరణకు ముందుకు వచ్చిన రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

రాజధాని భవిష్యత్ పై చంద్రబాబు హామీ
అమరావతిలో ఇప్పటికే ప్రభుత్వం రెండో విడత లాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు పలు గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అర్దిక పరిస్థితి అర్దం చేసుకొని లాండ్ పూలింగ్ కు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాజధానికి భూములు ఇచ్చిన ఏ రైతుకు అన్యాయం జరగదని స్పష్టం చేసారు. అమరావతికి కేంద్రం సహకారం అందిస్తోందని వివరించారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రైతులే అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. ఆ భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తమదే అని హామీ ఇచ్చారు. చంద్రబాబు తో సమావేశంలో తమకు ప్రభుత్వం ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల పైన కొందరు రైతులు కొత్త ప్రతిపాదనలు చేసారు. తమ గ్రామాల పరిధిలోనే ఇవ్వాలని కొందరు.. ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఇవ్వాలని మరి కొందరు రైతులు కోరారు. వారి వినతుల పైన చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.













Click it and Unblock the Notifications