ఇటు ఐప్యాక్ ప్యాకప్ - అటు రాబిన్ టీంకు కీలక బాధ్యతలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఈ బృందం సేవలు వినియోగించు కోవాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో జగన్కు రాజకీయంగా సేవలందించిన ఐపాక్ టీం రాష్ట్రం నుంచి ప్యాక్ అప్ అయింది. రాబిన్ శర్మ టీం కి చంద్రబాబు కొత్త ఎస్సైన్మెంట్ అప్పగించారు. దీంతో, పా్టీ వ్యవహారాల్లో ఇక ఈ టీం కీలకం కానుంది.
టీడీపీకి సేవల కొనసాగింపు
ఎన్నికల్లో టిడిపి విజయానికి పనిచేసిన రాబిన్ శర్మ టీం ను కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా రాబిన్ శర్మ బృందం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు చేపట్టింది. గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసిన రాబిన్ తర్వాత సొంతంగా షో టైం గ్రూప్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పని చేయటం మొదలు పెట్టింది. ఏపీలో టీడీపీ విజయంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సేవలందించేందుకు సీఎం షిండే నాయకత్వంలోని శివసేన షో టైం కన్సల్టేషన్ ఎంపిక చేసుకుంది. దీంతో రాబిన్ శర్మ తన టీం తో ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ పని మొదలు పెట్టారు.

క్షేత్ర స్థాయి నివేదికలు
ఇదే బృందంలో కీలక బాధ్యత నిర్వహిస్తున్న శంతన్ మాత్రం ఏపీలో కొనసాగుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాజకీయపరమైన విధుల కోసం ఈ బృందాన్ని వినియోగించుకోవాలని టిడిపి నిర్ణయించింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ బృందం సమావేశమైంది. తాను ఈ టీం నుంచి రానున్న రోజుల్లో ఏం కోరుకుంటున్నది చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ బృందం క్షేత్రస్థాయిలో టిడిపి పనితీరు పైన దృష్టి పెడుతుంది. పార్టీ పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సూచన చేస్తుంది. పార్టీ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తుంది.
ఐప్యాక్ టీం ప్యాకప్
ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం తెలుసుకొని నివేదిస్తుంది. ప్రజాభిప్రాయ అధ్యయన నివేదికనలో ఎప్పటికప్పుడు పార్టీకి అందిస్తుంది. 2019లో జగన్ అధికారంలోకి రావటానికి సహకరించిన ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐప్యాక్ టీం తరువాతి కాలంలో రుషిరాజ్ సింగ్ నాయకత్వంలో వైసీపీ కోసం పని చేసింది. తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ టీం మొత్తం రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైసీపీ రాజకీయంగా ఎవరితోనూ కొత్త ఒప్పందాలు చేసుకోలేదు. గత అయిదేళ్ల కాలంలో జగన్ కు ఐప్యాక్ అందించిన సేవల తరహాలోనే ఇప్పుడు శంతన్ టీం టీడీపీకి పని చేయనుంది.












Click it and Unblock the Notifications