కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు, ఇక అంతా..!!
ఏపీని మొంథా తుఫాను వెంటాడుతోంది. ఈ రాత్రికి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాను వేళ విమానాలు.. రైళ్లు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పటికే తుఫాను ప్రభావం విశాఖ, కాకినాడ లో మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగం తుఫాను సహాయక చర్యల పైన సమాయత్తం అయింది. ఇదే సమయంలో కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.
తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తుఫాను చర్యల పైన సీఎం చంద్రబాబు కూటమి పార్టీల నేతల తో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. తుపాన్ కారణంగా నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని నేతలకు సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మొంథా తుఫాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కి.మీ దూరం నుంచి 15 కి.మీ వేగంతో రాష్ట్రం వైపు వస్తోందని తెలియజేశారు.

ఈ రోజు రాత్రికి తుఫాను తీవ్ర రూపం దాల్చి మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిపారు. తుపాన్ ప్రభావంతో కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎన్డీయే శ్రేణులు నేడు, రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పంటలను మునకనుంచి కాపాడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలియజేశామని.. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీయే కార్యకర్తలు స్వచ్ఛంధ సేవకులుగా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దాదాపు 39 నియోజకవర్గాలకు వర్ష ప్రభావం ఎక్కువగా చూపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications