ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా చంద్రబాబు కీలక నిర్ణయం..!!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ నుంచి ఇద్దరు ఈ ఘటనలో ప్రాణాలు వదిలారు. వీరి భౌతిక ఖాయాన్ని ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపుతున్నారు. నెల్లూరు జిల్లా, విశాఖకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఘటన పైన కేంద్రం తక్షణ చర్యలు ప్రారంభించింది. దాడులకు కారకులైన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఇదే సమయంలో ఇటు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ తెలుగు సంఘం సభ్యులు జేఎస్ చంద్రమౌళి, మధు సూదన్‌లకి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచన లు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉన్నాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మచ్చ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఉగ్రవాదం, హింస వారు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఏదీ సాధించలేరని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావంగా నిలుస్తోందని తెలిపారు. ఈ హేయమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.

కాగా, ప్రకాశం జిల్లాలో ఉన్న చంద్రబాబు అక్కడ మరణించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళి అర్పించిన తరువాత గన్నవరం చేరుకోను్ననారు. ఆ తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి 10 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనుంది. ఈరోజు రాత్రికి విశాఖపట్నంలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. చంద్రమౌళి మృతదేహం ఈ రాత్రికి విశాఖ చేరుకున్న తర్వాత సీఎం చంద్రబాబు నివాళులు అర్పించనున్నారు. రేపు ఉదయం చంద్రమౌళి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రమౌళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్దికంగా సాయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications