కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు బిగ్ టాస్క్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఎమ్మెల్యేలు వివాదాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. ఇసుక, మద్యం వ్యవహారాల్లో తల దూర్చితే సహించేది లేదని హెచ్చరిక చేసారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కోరిన కొన్ని అంశాల పైన సానుకూలంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితాలు రావాలని .. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసారు.
జోక్యం చేసుకోవద్దు
మూడు పార్టీల ఎమ్మెల్యేలతో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరని చెప్పారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ గతంలో వైసీపీ ఎమ్మెల్యేల లాగా చేయవద్దని నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తూ ముందుకెళుతోందని వివరించారు. పాలనలో ఇంకా వేగం పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేసారు.

భాగస్వాములు కావాలి
సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా తమ బాధ్యత కూటమి ఎమ్మెల్యేలు మరిచిపోవద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై జిల్లా వారీగా ఏబీసీ కేటగిరీలు పెట్టి జిల్లా, జోన్, స్టేట్ వారీగా కమిటీలు వేసి అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాలసీ విధానాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
తిరుమల దర్శన కోటా పెంపు
ఈ సమావేశంలో చంద్రబాబు కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి.. వాటికి ఎమ్మెల్యేలే దానికి చైర్మన్లుగా ఉంటారని చెప్పారు. అక్కడ పరిశ్రమలు పెట్టించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. ఇసుక పాలసీని అందరూ చదివి అర్థం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలకు టీటీడీ దర్శన కోటా పెంచాలని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సమావేశంలో సూచించారు. వెంటనే స్పందించిన మంత్రి మంత్రి లోకేశ్ ఈ నెల 18న జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. భూసర్వేలో తలెత్తుతున్న సమస్యలను కొందరు ప్రస్తావించారు. వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications