బీహార్ కు చంద్రబాబు, నారా లోకేష్..: అక్కడే !!
బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఆయన ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
ఈ ఉదయం 11: 30 గంటలకు పాట్నా గాంధీ మైదాన్ నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేబినెట్ సహచరులు హాజరు కానున్నారు. అలాగే- బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రుల కూర్చులో పెద్దగా మార్పులు చోటు చేసుకోవట్లేదు.

హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీ నుంచి కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా తరఫున ఆ పార్టీ అధిపతి ఉపేంద్ర కుష్వాహా సతీమణి స్నేహలత కుష్వాహా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) కూడా నితీష్ కేబినెట్‌లో భాగం కానుంది. ఈ పార్టీ కోటా నుంచి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజు తివారీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి, లేసి సింగ్, జమా ఖాన్ మంత్రి పదవులను స్వీకరించనున్నారు. వీరి పేర్లను జేడీయూ ఖరారు చేసింది. బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కొనసాగడంతో పాటు మంగళ్ పాండే, నితిన్ నవీన్, రేణు దేవి, సంజయ్ సరావగి, రమా నిషాద్, కృష్ణ కుమార్ రిషి కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. వీరిద్దరూ హాజరు కానున్నట్లు జేడీయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వారికి ఆహ్వానాలు పంపించామని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిథ్యనాథ్, రేఖా గుప్తా, భజన్ లాల్ శర్మ, నాయబ్ సింగ్ సైనీ, మోహన్ యాదవ్.. వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications