ఎవరూ విశ్రమించొద్దు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
తుఫాను ఆర్నాబ్ భారీ నష్టాన్ని మిగుల్చింది. ఉత్తరాంధ్ర వణికిపోయింది. కోనసీమ కకలావికలం అయింది. నష్టపోయిన వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాయం పైనా ఇప్పటి కే ప్రకటన చేసింది. తాజాగా నష్టం పైన అధికారులు అంచనాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేసారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని స్పష్టం చేసారు.
ఆర్నాబ్ తుఫాను నుంచి కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రభావిత ప్రాంతాల్లో క్రమేణా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష చేసారు. తుఫాన్ నష్టంపై ఇవాళ ప్రాథమిక నివేదికను అందిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలని.. అర్నబ్ తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని.. రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుఫాన్ వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయని.. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలని నిర్దేశించారు.

సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం
అదే విధంగా ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి ఉందని సీఎం చెప్పారు. పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయటపడే యాలని సూచించారు. అర్నబ్ తుఫాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశామని పేర్కొన్నారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పంట నష్టం మినహా బాధితులకు నష్టపరిహరం అందించాలని సూచించారు. త్వరగా తుఫాన్ నష్టంపై అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొనేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రభుత్వం చేసే పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలని.. అప్పుడే ప్రజల నుంచి సహకారం లభిస్తుందని సీఎం సూచించారు.













Click it and Unblock the Notifications
