అన్ని రకాలుగా ఒత్తిడి తెద్దాం
Chandrababu: ఇంకో రెండు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. ఈ నెల 25వ తేదీన లోక్‌సభ, రాజ్యసభ భేటీ కానుంది. 2027 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ సమావేశాలపై అందరి దృష్టీ నిలిచింది.
వక్ఫ్ సవరణల బిల్లు సైతం
మొత్తం 15 బిల్లులు సభలో ప్రవేశపెట్టడానికి అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి చర్యలు తీసుకుంది. వక్ఫ్ సవరణల బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందనే అంచనాలు ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లు టేబుల్ అయిన విషయం తెలిసింది. అప్పట్లో ఇది ఆమోదం పొందలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది కేంద్రం. ఇప్పుడు ఈ బిల్లును ఆమోదించేలా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ప్రస్తావన
అలాగే- వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ప్రస్తావన సైతం ఈ సమావేశాల్లోనే చర్చకు రావొచ్చని చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ఏమిటనేది స్పష్టం చేసే అవకాశం ఉంది. 2027 ఫిబ్రవరి నాటికి జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
టీడీపీ వ్యూహం ఏంటీ?
ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉంటూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. వక్ఫ్ సవరణలు, జమిలి సహా కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులపై టీడీపీ ఎలాంటి ప్లాన్ ఏమిటనేది ఆసక్తి రేపుతోంది.
పార్లమెంటరీ పార్టీ భేటీ
శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు దీనికి హాజరయ్యారు.
రాజీ పడొద్దు..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర-2047 విజన్ అమలుకు కేంద్రం నుంచి మద్దతు కోరాలని సూచించారు. కేంద్రం సహకారంతో సాధ్యమైనంత మేర పెట్టుబడులను తీసుకుని రావాలని చెప్పారు.
కేంద్రంపై ఒత్తిడి
పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులపై సమయానుకూలంగా స్పందించాలని, సత్వర నిర్ణయాలను తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. కేంద్రంతో సానుకూలంగా వ్యవహరిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలపై ఒత్తిడిని తీసుకుని రావాలని ఆయన ఎంపీలకు సూచించారు.












Click it and Unblock the Notifications