చంద్రబాబు టెలికాన్ఫరెన్స్- రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవు ప్రకటించే ఛాన్స్
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారబోతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అక్కడితో దీని ప్రయాణం ఆగట్లేదు. క్రమంగా ఇది తుఫాన్ ను అవతరించనుంది. సోమవారం నాటికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారనుంది.
దీనికి మోంథాగా నామకరణం సైతం చేశారు. దీని ప్రభావం దక్షిణాదిపై తీవ్రంగా ఉండనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఈ నెల 27వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తమిళనాడులోని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురి అవుతుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు సముద్రం మీదికి వెళ్లకూడదని సూచించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం శనివారం రాత్రి 11:30 గంటల సమయానికి 11.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87.7 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై కనిపించింది. గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమ దిశగా 550, చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా 850, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయం దిశలో 890, కాకినాడకు ఆగ్నేయ దిశలో 890, ఒడిశాలోని గోపాల్‌పూర్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 970 కిలోమీటర్ల దూరంలో తీరం వైపు కదులుతోంది. ఆదివారం ఉదయానికి నైరుతి- దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడనుంది.
అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28వ తేదీన ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీస్తాయని, దీని తీవ్రత 110 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని ఐఎండీ వెల్లడించింది.
మంథా తుఫాన్ ఏపీలో తీరం దాటనున్న నేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేకంగా జోనల్ ఇన్ ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారీ వర్షాలు, వరదలు సంభవించే జిల్లాలకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications