దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు: వందల కోట్ల రూపాయల్లో ఆస్తులు
Chandrababu: దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 9,31,83,70,656 కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో ఆస్తిపాస్తులను కూడబెట్టుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరు. అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ నిలిచారు.
ముఖ్యమంత్రులకు చెందిన ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదిన ఇది. ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2023- 2024 సంబంధించిన ఆదాయ వివరాలు ఇవి. దీని ప్రకారం జాతీయ సగటు ఆదాయం (ఎన్ఎన్ఐ) 1,85,854 రూపాయలు ఉండగా.. ముఖ్యమంత్రుల స్వీయ సగటు ఆదాయం 13,64,310 రూపాయలుగా ఉంటోంది. అంటే ఎన్ఎన్ఐతో పోల్చుకుంటే 7.3 శాతం ముఖ్యమంత్రుల ఆదాయం అధికం అన్నమాట.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ 52.59 కోట్ల రూపాయలు. 31 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల మొత్తం స్థిర చరాస్తుల విలువ సగటు మొత్తం 1,630 కోట్ల రూపాయలుగా తేలింది ఏడీఆర్ నివేదిక ప్రకారం.
అత్యధిక అసెట్స్ ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు తొలి స్థానంలో నిలిచారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 1,21,41,41,609 రూపాయలు కాగా చరాస్తుల విలువ 8,10,42,29,047 రూపాయలుగా ఏడీఆర్ నివేదిక నిర్ధారించింది.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 332 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 1,67,45,78,832 రూపాయలు. కాగా చరాస్తుల విలువ 1,65,10,74,321 రూపాయలు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 51 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 30,61,56,918 రూపాయలు. కాగా చరాస్తుల విలువ 21,32,31,992 రూపాయలుగా తేలింది.
తక్కువ ఆస్తులు ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అగ్రస్థానంలో నిలిచారు. ఆమెకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. 15,38,029 రూపాయల మేర చరస్తులు మాత్రమే ఉన్నాయి. రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, మూడో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నారు.
ఒమర్ అబ్దుల్లా మొత్తం ఆస్తుల విలువ 55 లక్షల రూపాయలు. ఇందులో చరాస్తులు ఏమీ లేవు. 55,24,430 రూపాయల మేర చరాస్తులు మాత్రమే ఉన్నాయి. పినరయి విజయన్ పరిస్థితీ దాదాపుగా ఇంతే. ఆయన మొత్తం ఆస్తుల విలువ కోటి రూపాయలు మాత్రమే. ఇందులో స్థిరాస్తులు 86,95,000 రూపాయలుగా కాగా చరాస్తులు 31,80,766 రూపాయలు.












Click it and Unblock the Notifications