ఏపీలో సంపద సృష్టికి చంద్రబాబు ప్లాన్ అదుర్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 227వ ఎస్ఎల్బిసి సమావేశం జరిగింది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రుణ ప్రణాళిక విడుదల చేయడంతోపాటు 5ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది.
5.4లక్షల కోట్ల రూపాయలతో రుణ ప్రణాళికలు
2024- 25 ఆర్థిక సంవత్సరానికి 5.4లక్షల కోట్ల రూపాయలతో రుణ ప్రణాళికలు విడుదల చేశారు. ఇందులో 3.75 లక్షల కోట్లు ప్రాధాన్యతా రంగాలకు 1.65 లక్షల కోట్ల రూపాయలు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను విడుదల చేశారు. 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 3. 23 లక్షల కోట్లు రుణ ప్రణాళిక పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరం 3.75 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు.

వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్లు రుణాలు
గతేడాది కంటే 16 శాతం అధికంగా రుణాలను లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంటే గతం కంటే 14 శాతం అధికంగా వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకు, డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణ తదితరాలకు 32వేల 600 కోట్లతో రుణ ప్రణాళికను సిద్ధం చేశారు.
ఎంఎస్ఎంఈ రంగానికి 87 వేల కోట్ల లక్ష్యం
ఇక వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రెండు లక్షల 31 వేల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందులో రెండు లక్షల ఎనిమిది వేల 136 కోట్ల రుణాలను మంజూరు చేశారు. కాగా ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే సూక్ష్మ మరియు మధ్య తరహా ఉపాధి రంగానికి గత సంవత్సరం 69 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సంవత్సరం 87 వేల కోట్ల లక్ష్యంగా నిర్ణయించారు.

గృహ నిర్మాణ రంగానికి 11500 కోట్ల రుణ ప్రణాళిక
అంటే గతేడాది కంటే 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని ప్లాన్ చేశారు. గృహ నిర్మాణ రంగానికి 11500 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక సిద్ధం చేశారు. సాంప్రదాయేతర ఇంధన సెక్టార్ కు ఎనిమిది వేల కోట్ల రుణ ప్రణాళికను రెడీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలో అనేక అంశాల పైన ప్రధానంగా దృష్టి పెడుతున్న సీఎం చంద్రబాబు నేడు బ్యాంకర్లతో జరిగిన కీలక సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశాలపై బ్యాంకర్లు, మంత్రులతో కమిటీ
వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల భీమాను అందించటం, పి 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం, డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం, స్కిల్ డవల్మెంట్ కు చర్యలు తీసుకోవడం, సంపద సృష్టించే, జిఎస్డిపి పెంచే రంగాలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. .
బ్యాంకర్ల సహకారం అవసరం అన్న చంద్రబాబు
ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు బ్యాంకర్ లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి పథకాల అమలుకు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల బలోపేతం లో బ్యాంకర్ల దే ప్రాధాన్యత అన్నారు.












Click it and Unblock the Notifications