కరవు సీమలో హార్టికల్చర్ హబ్‌కు అంకురార్పణ! ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంపై సీఎం ఎమోషనల్
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రాయలసీమ ప్రాంతం త్వరలోనే దేశానికే ఫ్రూట్ బౌల్‌గా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహాత్మా గాంధీ గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న ఆశయానికి అనుగుణంగా ఈ చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవు సీమను రూ. 1 లక్ష కోట్ల వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేంద్ర సహకారంతో రూ. 40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల రూపంలో రూ. 60 వేల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజలు తనను 'హైటెక్ సీఎం'గా, 'సీఈఓ సీఎం'గా పిలిచారని, కానీ ఇప్పుడు తనను 'వాటర్ మ్యాన్' అని గుర్తిస్తుండటం ఎంతో ఆనందాన్నిస్తోందని ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. ఉమ్మడి ప్రకాశంతో కలుపుకొని రాయలసీమలోని 10 జిల్లాల్లోని 5,860 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తూ, అదనంగా 6 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, రూ. 3,500 కోట్లతో హంద్రీనీవా కాలువను కుప్పం వరకు తీసుకెళ్లిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో రూ. 35 వేల కోట్లతో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

పట్టిసీమతో కృష్ణా నీరు.. నదుల అనుసంధానమే శ్రీరామరక్ష
వాతావరణ మార్పులు, ఎల్ నినో పరిస్థితుల మధ్య కూడా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలించి, అక్కడ పొదుపు చేసిన నీటిని రాయలసీమకు మళ్లించామని సీఎం గుర్తుచేశారు. నాడూ పట్టిసీమ కడుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, ఆనాడు పట్టుదలతో ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేడు రాయలసీమ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. గోదావరి నుంచి కావేరి వరకు నదులను అనుసంధానించడం ద్వారా దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. దీనివల్ల నీటి గొడవలు తొలగిపోయి కేవలం అభివృద్ధిపైనే అందరూ దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు.
వ్యవసాయ రంగంలో నూతన లీడర్ల తయారీకి 'ఐఎస్‌ఏ'
రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' (ISA) వ్యవసాయ రంగానికి అత్యంత కీలకం కానుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఐఐఎంలో మేనేజ్‌మెంట్ నిపుణులు, ఐఐటీలో టెక్నికల్ నిపుణులు తయారైనట్లే.. ఐఎస్‌ఏ ద్వారా వ్యవసాయంలో సరికొత్త లీడర్లు తయారవుతారని తెలిపారు. యాపిల్, స్ట్రాబెర్రీ, అరటి, ఆవకాడో, కివీ, డేట్స్ వంటి విభిన్న రకాల పంటలను పండిస్తూ, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా పంటల స్థిరీకరణతో పాటు ధరల స్థిరీకరణ కూడా సాధ్యపడుతుందని చెప్పారు.
అంబానీ సేవలు అభినందనీయం.. కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డగా భావిస్తున్నామని సీఎం ప్రకటించారు. వంతారా ద్వారా జంతువులకు సేవలు అందిస్తున్న అనంత్ అంబానీ.. తిరుమల శ్రీవారిపై భక్తితో ఈవీ బస్సులను కూడా సమకూర్చారని ప్రశంసించారు. సీడ్ టు షిప్‌మెంట్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ విధానాల ద్వారా రైతులకు పూర్తి మద్దతు అందించాలని రిలయన్స్ సంస్థను కోరారు. అలాగే దేశ ఆర్థిక మంత్రిగా మహిళా శక్తిని చాటుతూ, జీఎస్టీ సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు అమరావతి, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టులకు ఎంతో ఉదారంగా నిధులు కేటాయిస్తున్న నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాయలసీమలో పండించిన అరుదైన పండ్ల ఉత్పత్తులను కేంద్ర మంత్రికి, అనంత్ అంబానీకి సీఎం చంద్రబాబు అందజేశారు.













Click it and Unblock the Notifications
