నో కాంప్రమైజ్, పార్టీ నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు మున్సిపాల్టీలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. జెడ్పీ సీట్ల పైన కూటమిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే కూటమి నేతలకు చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. పలు ప్రాంతాల్లో రెబల్స్ బరిలో ఉండటంతో వారి విషయంలో చంద్రబాబు తేల్చేసారు. మూడు పార్టీల నేతలు కలిసి కట్టు గా పని చేయాల్సిందేనని.. ఇందులో మినహాయింపు లేదని తేల్చి చెప్పారు.
స్థానిక ఎన్నికల పైన కూటమి పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. 2024 ఎన్నికల్లో లభించిన అద్భుత విజయం తర్వాత.. ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ వస్తున్నామని అన్నారు. అందుకే 'చెప్పాం-చేస్తున్నాం' కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మిత్రధర్మాన్ని పాటించి తీరాల్సిందేనని.. అందులో ఎలాంటి వెసులుబాటూ లేదని తేల్చి చెప్పారు. 2024 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రచారానికి ప్రజల వద్దకు వెళ్తున్నామని గుర్తు చేశారు.

మూడు పార్టీలు కలిసి కట్టుగా పని చేయాలి
అదే విధంగా కేంద్ర, రాష్ట్రం, స్థానికంగా.. ఇలా మూడు స్థాయిల్లోనూ ఒకే ప్రభుత్వం ఉంటే కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని సోదాహరణతో వివరించారు. అగ్రనేతలు మొదలుకుని.. కార్యకర్త వరకు చేసే పనిని రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. పొత్తులు, రిజర్వేషన్ల కారణంతోపాటు సోషల్ రీ-ఇంజనీరింగ్లో భాగంగా కొంత మందికి అవకాశాలు దక్కలేదని వివరించారు. రాష్ట్రం, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపునిస్తామని.. వారిని నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ.. ప్రతి ప్రాంతానికీ లబ్ది చేకూర్చేలా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి.. ప్రజలకు కూటమి పార్టీల కార్యకర్తలే వారధిగా నిలవాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
