సాయం అందించండి- అమిత్ షా కు చంద్రబాబు ఫోన్..!!
ఆర్నాబ్ తుఫాను రాష్ట్రం పై పెను ప్రభావం చూపింది. కోనసీమ, విశాఖ జిల్లాలకు భారీ నష్టం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. తుఫాను తీరం దాటినా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించారు. కాగా.. రాష్ట్రంలో తుఫాను కారణంగా ఏర్పడిన పరిస్థితులు.. ప్రాధమిక నష్టం పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసారు. కేంద్ర బృందాలను పంపటంతో పాటుగా అండగా నిలవాలని కోరారు.
రాష్ట్రం పైన అర్నబ్ తుఫాను ప్రభావంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను వివరించారు. తఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖలో పేర్కొన్నారు. త్వరితగతిన తుఫాను నష్టం పై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. తుఫాను సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను నియచినట్టు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని సీఎం పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని లేఖలో వివరించారు. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని లేఖలో వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు తెలిపిన ముఖ్యమంత్రి వివరించారు.
అదే విధంగా భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70 వేల హెక్టార్లలో వరి పంటకు నీట మునిగినట్టు లేఖలో చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకూ 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిలిందని తెలిపిన ముఖ్యమంత్రి...కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని స్పష్టం చేసారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేలా కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు.
ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని లేఖలో పేర్కొన్నారు. తుఫాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని సీఎం వివరించారు. తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని..కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలని అమిత్‌షాను చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications
