కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక- డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం..!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న తమ ఉద్యోగులకు (Central Govt Employees) దీపావళి కానుక (Diwali Gift) ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉద్యోగులు ఎదురుచూస్తున్న కరువు భత్యం(DA)పై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులకు డీఏను 3 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ లభిస్తున్న కరువు భత్యంపై 3 శాతం పెంపుతో ఇకపై డీఏ లభించనుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు డీఏ పెంచుతారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రెండో అర్ధభాగానికి డీఏను 3 శాతం పెంచుతూ కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. డీఏ మూల వేతనంలో 60 శాతం నుండి 63 శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.10,016 కోట్ల మేర ఆర్థిక భారం పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేబినెట్ 2 శాతం పెంపును ఆమోదించగా, ఇప్పుడు పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాల ఆధారంగా దీన్ని 3 శాతంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది జూలై నుంచి డీఏ పెంపును ఉద్యోగులకు వర్తింపచేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ గానూ, పెన్షనర్లకు డీఆర్ రూపంలోనూ ఏడాదికి రెండుసార్లు ప్రభుత్వం ఇలా చెల్లింపులు చేస్తుంటుంది. మూల వేతనంలో డీఏ లేదా మూల పెన్షన్ లో డీఆర్ రెండూ ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో 60 నుంచి 63 శాతానికి చేరుకున్నాయి. ప్రతీ ఉద్యోగి లేదా పెన్షనర్లు పొందుతున్న వేతనం లేదా పెన్షన్ లో కొంత మొత్తాన్ని కరువు భత్యం రూపంలో చెల్లిస్తారు. దీన్ని ప్రతీ ఏటా రెండుసార్లు సవరిస్తారు. ఈ పెంపు కోసం అప్పటికి దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, ఇతర అంశాల్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో రేట్లు మండిపోతున్న నేపథ్యంలో డీఏ పెంపును 3 శాతంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
