దీపావళి గిఫ్ట్ గా ఉద్యోగులకు SUV కార్లు..! ఫార్మా కంపెనీ మర్చిపోలేని కానుక..!
దీపావళి అంటేనే బహుమతుల పండుగ. దాదాపు ప్రతీ కంపెనీ తమ ఉద్యోగులకు దీపావళి సందర్బంగా మిఠాయిలు, డ్రై ఫ్లూట్స్, చిన్న చిన్న కానుకలు ఇస్తూనే ఉంటుంది. అయితే ఓ కంపెనీ మాత్రం తమ సంస్ధలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి వారికి దీపావళి కానుకగా (Diwali Bonanza) ఏకంగా కియా బ్రాండ్ ఎస్యూవీలను ఇచ్చేసింది. దీంతో సదరు కంపెనీ గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. ఇంతకీ ఈ నలుగురు ఉద్యోగులకు మాత్రమే సదరు కంపెనీ ఇలా ఎస్యూవీ కార్లను ఎందుకు ఇచ్చిందో ఓసారి చూద్దాం..
పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్.. దీపావళికి ముందు తమ సంస్ధలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను ఎంపిక చేసి, వారికి సరికొత్త కియా సోనెట్ ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇచ్చింది. దీనిపై ఆన్‌లైన్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన ఎంకే భాటియా.. తమ సంస్థ పట్ల ఉద్యోగుల పనితీరు, విధేయతకు గుర్తింపుగా ఈ బహుమతిని అందించారు. తమ కంపెనీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న, అలాగే మంచి పనితీరు కూడా కనబరుస్తున్న ఉద్యోగుల్ని గుర్తించి గౌరవించే లక్ష్యంతో ఇలా కార్లను వారికి ఇచ్చారు.

ఇలా నలుగురు ఉద్యోగులకు ఇచ్చిన SUV కార్లకు సంబంధించిన డౌన్ పేమెంట్ ను కంపెనీ చెల్లించింది. అయితే నెలలవారీ వాయిదాలను మాత్రం ఉద్యోగుల జీతాల్లో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్లను మాత్రం దీపావళి కానుకగా అందుకున్న ఉద్యోగుల పేర్ల మీదే రిజిస్టర్ చేస్తారు. ఇలా కార్లు ఇచ్చేందుకు కంపెనీ అనుసరిస్తున్న విధానంలో భాగంగా అర్హులైన
ఉద్యోగుల కోసం కంపెనీ ఒక లక్కీ డ్రాను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా తమ సిబ్బందిలోని మరికొంత మందికి కారు పొందే అవకాశం కల్పిస్తోంది. కేవలం పనితీరు ఆధారంగా ఎంపికైన ఉద్యోగులకే కాకుండా, ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తోంది. గతంలోనూ కంపెనీ సీఈవో భాటియా 2025లో దీపావళి సందర్భంగా ఇలా తమ టీమ్ లోని 51 మందికి వాహనాలు అందజేశారు. తన విజయం వెనుక ఉన్న వ్యక్తులు వారేనని భాటియా చెప్తుంటారు.












Click it and Unblock the Notifications
