తమిళనాడు పరిణామాలపై రాష్ట్రపతి జోక్యం కోరిన స్టాలిన్.. !!
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గట్లేదు. దీపావళి వరకు అన్ని రకాల ఆందోళనలు, ఉద్యమాలకు కాక్రోచ్ జనత పార్టీ పుల్ స్టాప్ పెట్టినప్పటికీ.. ఇండియా బ్లాక్ గానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు గానీ వీటిని చల్లారనివ్వట్లేదు. అటు కాంగ్రెస్ కూడా ఈ నెల 1వ తేదీన రామ్ లీలా మైదాన్ వద్ద భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. 10 లక్షల మందికి పైగా దీనికి హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తెరమీదికి వచ్చారు. జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారాయన. తమిళనాడులో ఓట్ల తొలగింపు చర్యల వల్ల చోటు చేసుకున్న పరిణామాలను ఇందులో ప్రస్తావించారు. ఓటర్ల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణల వల్ల లక్షలాదిమంది తమ ఓటు హక్కును కోల్పోయారని వివరించారు.

పార్లమెంట్ ఆర్టికల్ 86 (2) ఆధారంగా జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. తోటి ఇద్దరు కమిషనర్లను కాదని సొంతంగా, అనాలోచితంగా, అసంబద్ధంగా జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలను తీసుకుంటోన్నారని, ఎన్నికల కమిషన్ వంటి హోదాలో ఉన్న అధికారి ఇలా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించడం ఏ మాత్రం తగదని అన్నారు. జ్ఞానేష్ కుమార్ వైఖరిని ఇద్దరు కమిషనర్లు కూడా తప్పుపట్టారని గుర్తు చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 143, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని స్టాలిన్ కోరారు. తమిళనాడులో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వల్ల ఒక్క తమిళనాడులోనే 97,37,832 ఓట్లు తొలగింపునకు గురయ్యాయని వివరించారు. రాజ్యాంగ విరుద్ధమైనది కావడం వల్ల తమిళనాడులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఏ ఒక్క ఎన్నికను కూడా నిర్వహించకూడదని అన్నారు.
జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవడం ద్వారా.. ఎన్నికల వ్యవస్థపై సామాన్య ప్రజల్లో గల నమ్మకాన్ని పునరుద్ధరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. మున్ముందు జరిగే అన్ని రకాల ఎన్నికలను కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలనీ చెప్పారు. అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వల్ల వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలు కూడా దక్కకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications
