హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు
Chandrababu: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరంలో దిగాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. కిందటి నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు. కల్కాజీ నుంచి ఆతిషి పోటీలో ఉన్నారు. అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
రేపటితో ఎన్నికల ప్రచారానికి తెర పడబోతోంది. ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారబరిలో దిగబోతోన్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం సాగించనున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నేడు, రేపు ఆయన ఢిల్లీ ప్రచార పర్వంలో పాల్గొంటారు.
ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినందున ఆయన సేవలను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటోంది బీజేపీ. దీనికోసం చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరుకుంటారు.
ప్రచార కార్యక్రమాలు ముగిసిన అనంతరం చంద్రబాబు.. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్.. సహా పలువురిని కలుస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications