తుఫాను దూసుకొస్తోంది, ఈ జిల్లాలపై పెను ప్రభావం - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
ఆర్నాబ్ తుఫాను తీరం ప్రాంతాన్ని వణికిస్తోంది. ప్రభుత్వం అప్రమత్తం అయింది. రేపు ఉదయం తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల అధికారులను అలర్ట్ చేసారు. ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసారు. సీఎం చంద్రబాబు పరిస్థితి సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసారు. తుఫాను ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సన్నద్ధతా చర్యలపై దిశా నిర్దేశం చేసిన సీఎం.. ప్రస్తుత పరిస్థితుల పైన జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు. జిల్లాల్లో ఆర్నబ్ తుపాను చూపనున్న ప్రభావం, భారీ వర్షాల పరిస్థితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ సమీపంలోని యానాం కు 167 కిలో మీటర్ల దూరంలో అర్నబ్ తుఫాన్ కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు. గడచిన ఆరు గంటల గా తీరంవైపుగా 23 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని అధికారుల వివరించారు. కాగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని వివిధ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వం ముందస్తు చర్యలు
అదే విధంగా తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు వంటివి అందుబాటులో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. తుఫాను ప్రస్తుతానికి విశాఖపట్నంకు 220కి.మీ., కాకినాడకు 240 కి.మీ., మచిలీపట్నం కు 340 కి.మీ., బాపట్లకు 410 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందని.. రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. కాగా.. రాగల 3 గంటలు విశాఖ, శ్రీకాకుళం, విజయ నగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.













Click it and Unblock the Notifications
