ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు - ఈ సారి ప్రత్యేకంగా..!!
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు ప్రజల సంప్రదాయం ఉట్టి పడేలా ఉగాది వేడుకలు నిర్వహించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు ప్రజల సంప్రదాయం ఉట్టి పడేలా ఉగాది వేడుకలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం వైయస్ జగన్ దంపతులు పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ.. కొత్త లక్ష్యాలకు, ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలే జరగాలి, సమృద్ధిగా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి. రైతులకు మేలు జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నూతన పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం వైయస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉగాది వేడుల ఏర్పాట్లు చేసారు

కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరామ సోమయాజి అన్నారు. పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సన్మానించారు. తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు.. సీఎం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.సీఎం జగన్ దంపతులకు మంత్రి ఆర్కే రోజా మెమెంటో అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు.












Click it and Unblock the Notifications