రంగంలోకి సీఎం జగన్ - అక్కడే ఫోకస్, ఆ నేతలకు పిలుపు..!!
ఎన్నికల వేళ సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమరంలో ఇతర పార్టీల కంటే ముందున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అభ్యర్దుల ఎంపిక తుది దశకు చేరింది. ఈ సమయంలోనే పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనూ పార్టీలో సీట్ల కేటాయింపుతో ప్రాధాన్యత దక్కని సీనియర్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వీరిని వదులుకోవటానికి పార్టీ సిద్దంగా లేదనే సంకేతాలు ఇస్తున్నారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. మంత్రాంగం ప్రారంభించారు.
సీఎం జగన్ వ్యూహాలు : నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేసారు. అయితే, నెల్లూరు సిటీ అభ్యర్ది మార్పు విషయంలో తనను పరిగణలోకి తీసుకోకపోవటం పైన వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చంద్రబాబుతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి అదే జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల పార్టీ ప్రతినిధిగా మంతనాలు చేసారు. వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారని..తన రాయబారం సక్సెస్ అవ్వలేదని తేల్చి చెప్పారు. దీంతో, ముఖ్యమంత్రి సన్నిహిత నేత నేరుగా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పునరాలోచనలో పడినట్లు సమాచారం. నేరుగా సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకొనే ఆలోచనలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి సమీక్ష : నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ పట్టు కోల్పోకూడదని మొత్తం పది స్థానాల్లో 2019 తరహాలోనే క్లీన్ స్వీప్ చేయాలని జిల్లా నేతలకు జగన్ లక్ష్యంగా నిర్దేశించారు. కొన్ని సీట్ల ప్రకటన పైన స్థానికం గా ఉన్న అభ్యంతరాలను తాను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష ఏర్పాటు చేసారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ న నర్సరావు పేట ఎంపీగా బరిలోకి దించారు. అనిల్ నర్సరావు పేటలో ఎంట్రీ వేళ మంచి స్పందన వచ్చింది. అక్కడ పార్టీలో ముఖ్య బీసీ నేతగా ఉన్న జంగా క్రిష్ణమూర్తి పార్టీకి దూరమయ్యారు. అయితే, నెల్లూరు..ప్రకాశం,..గుంటూరు నుంచి మరెవరూ పార్టీ వీడకుండా సీఎం ముఖ్య నేతలకు బాధ్యతలు కేటాయించారు. ఎంపీ విజయ సాయిరెడ్డితో పాటుగా చెవిరెడ్డిని రంగంలోకి దింపారు.

కొత్త వ్యూహాలతో : ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి ఎట్టకేలకు రాజీపడ్డారు. చెవిరెడ్డితో కలిసి ఎన్నికల కార్యాచరణ ప్రారంభించారు. ఒంగోలులో ఇంటి స్థలాల పంపిణీ పైన కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో అభ్యర్దుల మార్పుతో వారి విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి స్థానం పైన జగన్ తాజాగా సమీక్ష చేసారు. నియోజకవర్గ నేతలతో నేరుగా చర్చించారు. అక్కడ తనకు వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ కొన్ని కీలక సూచనలు చేసారు. అవసరమైతే అక్కడ అభ్యర్ది మార్పు తప్పదని..గెలుపే కీలకమని తేల్చి చెప్పారు. అమరావతి పరిధిలోని మంగళగిరి, తాడికొండ స్థానాల్లో ఈ సారి గెలవాలనేది సీఎం జగన్ లక్ష్యం గా కనిపిస్తోంది. దీంతో..కీలకమైన నియోజకవర్గాల్లో పరిస్థితుల పై సమాచారం సేకరిస్తూ..సీఎం జగన్ అవసరమైన నేతలతో చర్చిస్తూ...నేరుగా ఫోకస్ చేయటంతో అక్కడ రాజకీయం ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications