సీట్ల ఖరారులో జగన్ లెక్కే వేరు, వారికి నో ఛాన్స్ - ఆ మంత్రుల్లో టెన్షన్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దుల ఖరారులో కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ సమావేశంలో ఎక్కవ మందికి సీట్లు వస్తాయి..కొందరికి సీట్లు రావని జగన్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో అభ్యర్దుల ఎంపిక కసరత్తు లెక్కలు ఇప్పుడు ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి.
వై నాల్ 175 నినాదంతో: ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. సీనియార్టీ..సిన్సియార్టీని పరిగణలోకి తీసుకుంటూనే గెలుపే ప్రామాణికం అని తేల్చి చెబుతున్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తారనే నమ్మకం కలిగితే మార్పులకు వెనుకాడటం లేదు. అందులో భాగంగా సీనియర్ల విషయంలోనూ మార్పులకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

నలుగురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఏలూరు, అనంతపురం, రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఇద్దరు సీనియర్లను లోక్ సభ బరిలో నిలబెట్టాలని భావిస్తున్నట్లగా చెబుతున్నారు. వారికి ఇప్పటికే ఈ మేరకు సూచనలు చేసినట్లు సమాచారం.
గెలుపే ప్రామాణికంగా: ఇక, సీనియర్ మంత్రి ధర్మాన వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరారు. కానీ, సీఎం ఈ సారి ధర్మానే పోటీ చేయాలని సూచించారు. అదే విధంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ప్రస్తుత ఎమ్మెల్సీ ఇక్బాల్ ను కదిరి నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది .
అదే విధంగా కోస్తా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులకు స్థాన చలనం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏలూరు ఎంపీ పోటీకి విముఖంగా ఉన్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయన స్థానంలో ఆళ్ల నాని ఎంపీగా బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణలే ప్రధానంగా సీఎం జగన్ అభ్యర్దుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మార్పులతో ఉత్కంఠ: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, గోదావరి జిల్లాల్లో అయిదుగురు, అనంత, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి ఈ సారి అవకాశం ఉండదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో తిరిగి లోక్ సభ బరిలో దింపుతారని ప్రచారం సాగుతోంది.
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని..2026 లో వచ్చే ఖాళీల్లో రాజ్యసభకు పంపుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ముగ్గుర ఎమ్మెల్యేలను సీమ జిల్లాల్లో ఎంపీలుగా దింపేందుకు సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు..క్షేత్ర స్థాయి అంశాలు..సర్వే నివేదికలే ఆధారంగా సీఎం జగన్ అభ్యర్దుల ఎంపిక చేస్తుండటంతో..సీట్లు ఎవరికి దక్కుతాయా..ఎవరికి నో చెబుతారనే ఉత్కంఠ పార్టీలో మొదలైంది.












Click it and Unblock the Notifications