అమరావతి మనందరిదీ, చరిత్రలో నిలిచేలా - సీఎం జగన్..!!
ఇక నుంచి అమరావతి మన అందరిది అంటూ సీఎం జగన్ నినదించారు. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైందని చెప్పారు. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నానని వెల్లడించారు. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించారు. పేదలకు ఇళ్లు రాకూడదనే కుట్ర చంద్రబాబు..దత్తపుత్రుడు చేసారని ఆరోపించారు. 50 వేల మంది పేదలకు ళ్లు ఇస్తున్నామని ప్రకటించారు.
సీఎం జగన్ భూమి పూజ : వరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అనంతరం వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది ఇప్పటికే ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించారు. ఈ రోజు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అమరావతిలో జరిగిన సభలో సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
దుష్టచతుష్ఠయం కుట్రలు చేసింది : పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు..దత్త పుత్రుడు..దుష్ట చతుష్ఠం అడ్డుకొనే ప్రయత్నాలు చేసిందని సీఎం జగన్ ఆరోపించారు. వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు-పేరు లేని సంఘాలు. వీళ్లంతా పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశాం అని చెప్పుకొచ్చారు.
ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజుగా పేర్కొన్నారు. రాజధాని అని చెబుతూ పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని కోర్టుల్లో వాదించారని గుర్తు చేసారు. పేదల శత్రువులపై పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పారు. పేదవాడికి ఇల్లు రాకూడదని.. అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారన్నారు. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారన్నారు.

ఇది పేదల ప్రభుత్వ విజయం : కేంద్ర మంత్రులను..కేంద్రంలోని అధికారులను కలిసి నిలుపుదల చేసే ప్రయత్నం చేసారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని సీఎం జగన్ నిలదీశారు.
పేద పిల్లలు బాగుపడడం వాళ్లకు ఇష్టం లేదు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉందో గమనించాలని సూచించారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో 25 లే అవుట్లలో 50 వేల మంది ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం జగన్ ప్రకటించారు. సీఆర్‌డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications