ప్రతీ ఇంటా తప్పనిసరి - ఎన్నికల వేళ జగన్ కీలక నిర్ణయం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. వీటిని సీఎం లాంఛనంగా ఆవిష్కరించారు. ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ యాప్‌తో పాటు దిశ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
జగన్ నిర్ణయాలు : ముఖ్యమంత్రి ఎన్నికల వేళ వరుస నిర్ణయాలు అమలు చేస్తున్నారు. కొత్త ఫీచర్స్ తో ఆరోగ్యశ్రీ కొత్త కార్డులను ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవలను ఎలా వినియోగించుకోవాలనే సందేహాలను ప్రజాప్రతినిధులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ పరధిని ప్రతి ఒక్కరికీ విస్తరించాలనే తపనతో అడుగులు వేసామని వివరించారు. నెలకు రూ.40 వేల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని వివరించారు. దీని వల్ల అక్షరాల 1.48 కోట్ల కుటుంబాలు (4.25 కోట్ల జనాభా) వీరందరూ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారని సీఎం వెల్లడించారు.

1.48 కోట్ల కుటుంబాలకు లబ్ది : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 1,059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధి పరిమితమై ఉండేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆ పేదవాడు ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రొసీజర్స్‌ను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లామని చెప్పారు. తరువాత 3,257 ప్రొసీజర్లతో ఈరోజు ఆరోగ్యశ్రీ నడిపిస్తున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు 2,513 ఆస్పత్రులకు విస్తరించడం జరిగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

ఇతర రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా : ఏపీలోని 2,309 ఆస్పత్రులు, హైదరాబాద్‌లోని 85 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఎంప్యానల్ చేశాం. బెంగళూరులో 35 ఆస్పత్రులు, చెన్నైలో 16 ఆస్పత్రులు.. మొత్తంగా 204 ఇతర రాష్ట్రాల్లోని నగరాలను ఎంప్యానల్ చేసి, గతంలో మాదిరిగా కాకుండా 716 ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాల్లోని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గతంలో కేవలం 748 ఆస్పత్రులకు మాత్రమే, కేవలం హైదరాబాద్‌లో 72 ఆస్పత్రుల్లో మాత్రమే పరిమితమై ఉండేది. రెండు కలిపినా కూడా కేవలం 820 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని నేడు.. ఏకంగా 2,513 ఆస్పత్రులకు విస్తరించామని వివరించారు. 25 లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications