సీఎం జగన్ రుణమాఫీ ప్రకటన - ముహూర్తం ఫిక్స్, ఎంత మేర..!?
సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా వస్తున్న వేళ ఎలాగైనా అధికారం నిలబెట్టుకొనే లక్ష్యంతో వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ సిద్దం సభ లను నిర్వహించిన వైసీపీ మూడో సభ ఆదివారం రాప్తాడులో నిర్వహించనుంది. ఈ సభా వేదికగా సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటించేందుకు డిసైడ్ అయ్యారు. రుణమాఫీ ప్రకటన ఉంటుందని పార్టీలో జోరు గా చర్చ సాగుతోంది. పెన్షన్ పెంపు ప్రకటిస్తారని సమాచారం.
జగన్ కీలక నిర్ణయాలు : రేపు (ఆదివారం) వైసీపీ భారీ స్థాయిలో సిద్దం సభ నిర్వహిస్తోంది. భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలోనే సీఎం జగన్ మ్యానిఫేస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసారు. దాదాపు 2.54 లక్షల మేర పథకాలను లబ్దిదారులకు అందించారు. ఇక, ఈ సారి వై నాట్ 175 నినాదంతో ఎన్నికల యుద్దంలోకి దిగుతున్న జగన్ ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందులో భాగంగా కొద్ది రోజులుగా ఎన్నికల వరాల పైన సంకేతాలు ఇస్తున్నారు. 2014తో తన పైన ఒత్తిడి వచ్చినా..అమలు చేయలేకనే రుణమాఫీ ప్రకటించలేదని శాసనసభలో సీఎం జగన్ వివరించారు.

ఎన్నికల వరాలు : 2019లో అమలు చేయగలిగిన హామీలనే ఇచ్చామని..అమలు చేసామని..మాట ఇస్తే చేస్తామని జగన్ స్పష్టం చేసారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీ ప్రకటన చేసినా అమలు చేయని అంశాన్ని జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ మరోసారి సంక్షేమ పథకాలను ప్రకటించింది. కానీ, ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించలేదు. దీంతో..ఇప్పుడు జగన్ తాను చెబితే అమలు చేస్తాననే నమ్మకం కలిగిస్తూ ఈ సభ ద్వారా రైతు రుణ మాఫీ ప్రకటిస్తారని పార్టీలో భారీగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఎంత మేర ఈ ప్రకటన ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాప 78 లక్షల మంది రైతులకు ప్రయోజనం అందుతోంది. ఇప్పుడు రుణమాఫీ ప్రకటిస్తే గేమ్ ఛేంజర్ గా మారుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాజకీయ ఉత్కంఠ : ఇక, 2019 ఎన్నికల సమయంలో సామాజిక పెన్షన్ ను రూ 2వేల నుంచి క్రమేణా రూ 3వేలకు పెంచుతానని జగన్ నాడు హామీ ఇచ్చారు. చెప్పిన విధంగా ఏటా రూ 250 చొప్పున పెంచుతూ గత నెల నుంచి రూ 3వేల చొప్పున దాదాపు 68 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ సభలో రూ 4 వేలకు పెన్షన్ పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా మహిళలకు సంబంధించిన వరాలు ఉంటాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే ప్రతిపక్షాలు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్దమవుతున్న సమయంలో జగన్ ముందుగానే అనంతపురం జిల్లా వేదికగా తన ఎన్నికల వరాలు ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో, జగన్ ప్రకటించే నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications