ఏపీ కేబినెట్ లో కీలక మార్పులు - కొడాలి నానితో సహా సీనియర్ల రీ ఎంట్రీ..!?
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ సమయంలోనూ కేబినెట్ ప్రక్షాళన గురించి చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సారి ప్రక్షాళనలో అనూహ్యంగా మాజీ మంత్రులు కొందరు రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి.
ఏపీలో మరోసారి మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందని తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో అటు పార్టీలో..ఇటు ప్రభుత్వంలో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో అయిదుగురు నుంచి ఆరుగురు వరకు తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గత నెలలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరిగింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం జగన్ పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారు వస్తారంటూ హెచ్చరించారు. టీడీపీ నాలుగు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకర్గాలతో పాటుగా ఎమ్మెల్యే కోటా ఎన్నిక గెలవటంతో..ఇప్పుడు జగన్ కౌంటర్ స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నారు.

మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా అధికారంలోకి వచ్చిన సమయంలో ఏర్పాటైన తొలి కేబినెట్ లో పని చేసిన కొందరు సీనియర్లను తిరిగి తన టీంలోకి తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రాంతీయ - సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోనున్నారు. తిరిగి కేబినెట్ లో తీసుకొనే వారి జాబితాలో కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే విధంగా నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు పార్టీకి దూరమైన క్రమంలో అదే వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరిని తొలిగిస్తారనే లెక్కల ఆధారంగా కొత్త వారికి ఛాన్స్ దక్కటం ఆధారపడి ఉంటుంది.
టీడీపీ-జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వారి పొత్తు ప్రధానంగా ప్రభావితం చేసే వర్గాలు - ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా క్రిష్ణా జిల్లా నుంచి తిరిగి కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులకు అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కర్నూలు, గుంటూరు, గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీకాకుళం జిల్లాల నుంచి మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, సీఎం జగన్ తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications