సీఎం జగన్ ఆపరేషన్ మంగళగిరి - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. సీఎం జగన్ ప్రత్యర్ధి పార్టీల ప్రధాన నేతల నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ కలిసిరావటం పైన సానుకూల సంకేతాలు రావటంతో అధికారిక నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలోనే మంగళగిరి లో నారా లోకేష్ పైన గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంపైన సీఎం జగన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంగళగిరిపై ఫోకస్: 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి అదే నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. చాలా కాలంగా నియోజకవర్గంలో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ అక్కడ నుంచి గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్దిగా ప్రకటించింది.

చేనేత సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉండటంతో అదే వర్గానికి చెందిన గంజి చిరంజీవి అభ్యర్దిత్వం కలిసి వస్తుందని వైసీపీ అంచనాగా ఉంది. అక్కడ ప్రస్తుతం గంజి చిరంజీవికి స్థానికంగా వైసీపీ నేతల సహకారం పైన ఫిర్యాదులు మొదలయ్యాయి. దీంతో, నేరుగా సీఎం జగన్ వారితో చర్చించారు.
సాయిరెడ్డికి బాధ్యతలు: గుంటూరు పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తగా విజయ సాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే మంగళగిరి నేతలతో సాయిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ ముఖ్యలతో సమన్వయం..సహకారం పైన చర్చించారు. అభ్యర్ది చిరంజీవి చెప్పిన అంశాలను సీఎంకు నివేదించారు. దీంతో.. నేరుగా సీఎం జగన్ తాజాగా మంగళగిరి నేతలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంత రావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఒక దశలో చిరంజీవి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను అభ్యర్దిగా ప్రకటిస్తున్నారనే ప్రచారం మొదలైంది. కానీ, పార్టీ నేతలంతా కలిసి కట్టుగా చిరంజీవికి సహకరించాలని సీఎం జగన్ సూచించారు. విజయ సాయిరెడ్డికి సమన్వయ బాధ్యతలను అప్పగించారు.

మారుతున్న లెక్కలు: అటు లోకేష్ ఈ సారి గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రభావం మంగళగిరి పైన ఉందనేది టీడీపీ నేతల వాదన. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో..ఆయన ఎన్నికల బరిలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సమయంలోనే అమరావతి పరిధిలోని తాడికొండ, మంగళగిరిలో గెలుపు కోసం విజయ సాయిరెడ్డి కి బాధ్యతలు కేటాయించారు. ఇదే సమయంలో వైసీపీ ఏడో జాబితా పైన కసరత్తు జరుగుతోంది. ఈ రోజు లేదా రేపు మార్పులు అవసరమైన నియోజకవర్గాల అభ్యర్దులను ఫ్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం సభలో పార్టీ మేనిఫెస్టో ప్రకటన ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యారు.












Click it and Unblock the Notifications