జగన్ చేతికి చంద్రబాబు అస్త్రం - సెల్ఫ్ గోల్..!!
ఏపీలో ఎన్నికల సమయంలో రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ రోజు నుంచి జనసేనాని పవన్ పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు శింగనమల వైసీపీ అభ్యర్ది రామాంజనేయులు పైన చేసిన వ్యాఖ్యలు..సీఎం జగన్ స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్సీ, పేదల పైన చంద్రబాబు ద్వేషంతో ఉన్నారంటూ వైసీపీ విమర్శిస్తోంది.
చంద్రబాబు కామెంట్స్
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శింగనమలలో కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులుకు ఇచ్చారని...వేలి ముద్రకు సీటు ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన రామాంజనేయులు స్పందించారు. తాను ఎంఏ ఎకనామిన్స్ చేసినట్లుగా సర్టిఫికెట్ చూపించారు. అదే సమయంలో తాను ఎస్సీగా, పేదవాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైసీపీ నేతలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు...మడకశిరకు ఉపాధిహామీ కూలీ లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేసారు వైసీపీ అధినేత జగన్.

స్పందించిన జగన్
గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి, నందిగం సురేష్ లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు జగన్. చంద్రబాబు శింగనమల అభ్యర్దిగా రామాంజనేయులుకు అవకాశం ఇవ్వటాన్ని అవహేళన చేయటాన్ని సీఎం జగన్ తప్పు బట్టారు. తమది పేదల పార్టీనని స్పష్టం చేసిన జగన్..రామాంజనేయులు విద్యార్హత గురించి వివరించారు. చంద్రబాబు కంటే ఉన్నత విద్యా వంతుడు అని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాక టిప్పర్ డ్రైవర్ అయ్యాడని చెప్పుకొచ్చారు. తమది పేదల పార్టీనని..పేదవాడికి సీటు ఇచ్చానని జగన్ స్పష్టం చేసారు. చంద్రబాబు పెత్తందారీ పోకడలు పోవటం లేదని జగన్ విమర్శించారు.

ఎన్నికల వేళ చర్చ
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన వీరాంజనేయుల పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా జగన్ తాము పేదవాడికి సీటు ఇచ్చామంటూ చేసిన వ్యాఖ్యలను వైసీసీ కేడర్ సర్క్యులేట్ చేస్తోంది. దీంతో..ఇప్పుడు కీలకమైన అనంత జిల్లాలో అటు చంద్రబాబు వ్యాఖ్యలు .. సీఎం జగన్ స్పందన ఎపిసోడ్ రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.












Click it and Unblock the Notifications